మొన్నటి వరకూ సెప్టెంబరు 5 పైనే అందరి దృష్టీ ఉండేది. ఎందుకంటే.. ఈ రోజున చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఘాటీ, మిరాయ్, మదరాసీ, భాగీ 3… ఇవన్నీ ఈ డేట్ ని ఫిక్స్ చేసుకొన్నాయి. మదరాసీ, భాగీ 3.. రెండూ డబ్బింగ్ సినిమాలే అయినా, తెలుగులో కూడా వీటికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు ఈ రేసు లోంచి `మిరాయ్` తప్పుకొందని సమాచారం. ఓ వారం ఆలస్యంగా.. అంటే సెప్టెంబరు 12న రావడానికి `మిరాయ్` రెడీగా ఉంది.
సెప్టెంబరు 12.. మొన్నటి వరకూ ఖాళీగా ఉండేది. ఆ డేట్ ని బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘కిష్కిందపురి’ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. సోలో రిలీజ్ డేట్ అని నిర్మాతలు కూడా హ్యాపీ ఫీలయ్యారు. అయితే ఇప్పుడు ‘మిరాయ్’ రూపంలో పోటీ ఎదురు కాబోతోంది. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. రవితేజ సినిమా ‘మాస్ జాతర’ కూడా సెప్టెంబరు 12నే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈనెల 27న ‘మాస్ జాతర’ రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమానీ సెప్టెంబరు 12నే తీసుకురావాలని భావిస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఆ రోజు ముక్కోణపు పోటీ తప్పదన్నమాట.