ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన సుదర్సన్ రెడ్డికి మద్దతు ఇస్తుందా లేదా అన్నదానిపై ఉన్న ఉత్కంఠను కేటీఆర్ తోసిపుచ్చేశారు. ఆయన తెలంగాణకు చెందిన న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినప్పటికీ.. ఆ గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి బదులుగా బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు. కంచె ఐలయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్తిగా నిలబెట్టి ఉండాల్సిందన్నారు.
సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ వెటకారం చేస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే అని చెప్పే బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఇండి కూటమి కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నిలబడితే.. మద్దతిచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదని.. ఆయనకు కాంగ్రెస్ తో సంబంధం లేదని రేవంత్ చెబుతున్నారు. హైకమాండ్ ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తానని కూడా ప్రకటించారు.
అయితే బీజేపీని వ్యతిరేకించే మూడ్లో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు. తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నత స్థానానికి పోటీ పడుతున్న తమ తెలంగాణ నినాదానికి భగ్నం కలుగుతున్నా.. ప్రజలు ఏదో అనుకుంటారని.. తెలంగాణ వాదం అనేది రాజకీయ లాభం కోసమే వాడుతున్నారని విమర్శలు వస్తాయని తెలిసినా.. బీఆర్ఎస్కు మరో మార్గం లేదు. బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం లేదా.. ఓటింగ్ ను బహిష్కరించడం. ఏది చేసినా బీజేపీకే లాభం.