ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయతపై జగన్ రెడ్డి కొట్టిన దెబ్బ ఆషామాషీది కాదు. నిజాయితీపరులపై అవినీతిపరులని నిందలేసి బెదిరిస్తే మళ్లీ ఈ వైపు ఎవరూ చూస్తారు?. వారి సహకారం మళ్లీ పొందాలంటే.. దాదాపుగా అసాధ్యం. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఉపాధి కేంద్రమైన రాజధానిని అందించి .. యువత భవిష్యత్ ను బంగారం చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం మాత్రం తన ప్రయత్నాలను మొక్కవోని పట్టుదలతో చేస్తూనే ఉంది. తాజాగా కేంద్రంతో గ్యారంటీ ఇప్పించాలని ప్రయత్నిస్తోంది.
చంద్రబాబు వెళ్లి మాట్లాడినా సింగపూర్ ససేమిరా !
అమరావతి సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి గతంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు ముందుకు వచ్చాయి. 2015లో, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ , సుర్బానా జురాంగ్ సంయుక్తంగా అమరావతికి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాయి. ఏపీ ప్రభుత్వం , సింగపూర్ కన్సార్టియం మధ్య ఒక జాయింట్ వెంచర్, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్, మధ్య6.84 చ.కి.మీ సీడ్ క్యాపిటల్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఒప్పందం జరిగింది. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిపై లంచాల కోసం బెదిరింపులకు పాల్పడటంతో ఒప్పందాలు రద్దయ్యాయి. కానీ అమరావతి అభివృద్ధికి సింగపూర్ సహకారం చాలా అవసరం అని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. అభివృద్ధి జరగాలంటే.. తప్పదని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. సింగపూర్ వెళ్లి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మేం పెట్టుబడులు పెడతాం..కానీ గ్యారంటీ ఏంటీ అన్న ప్రశ్న వారికి ఎదురయింది ?
కేంద్రంతో గ్యారంటీ ఇప్పించే ప్రయత్నాలు
సింగపూర్ పెట్టుబడులకు తాము గ్యారంటీ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోంది. దానికి కారణం ప్రభుత్వంగా ఉన్నప్పుడు జగన్ చేసిన నిర్వాకమే. రేపు మరో ప్రభుత్వం వచ్చి రద్దు చేయదని గ్యారంటీ ఏమిటని సింగపూర్ ప్రశ్న. అందుకే సింగపూర్‌ను మళ్లీ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం “గ్యారంటర్”గా వ్యవహరించాలని కోరుతోంది.. ఇది ప్రాజెక్టు విశ్వసనీయతను పెంచడానికి , సింగపూర్ కన్సార్టియం ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకమని కేంద్రం కూడా భావిస్తోంది.
సింగపూర్ అంగీకరిస్తే అమరావతి దశ మారినట్లే !
ఏపీ ప్రభుత్వం, సింగపూర్, ప్రపంచ బ్యాంకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి , సింగపూర్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సింగపూర్‌తో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం గ్యారంటర్‌గా వ్యవహరించడం వల్ల సింగపూర్‌కు ప్రాజెక్టు పై నమ్మకం కలుగుతుందని చెప్పవచ్చు. సింగపూర్.. కేంద్రం గ్యారంటీతో మళ్లీ అమరావతి నిర్మాణంలో భాగం అయితే మొత్తానికే గేమ్ ఛేంజర్ అనుకోవచ్చు. ఇది భారత విదేశీ పెట్టుబడుల ఎకో సిస్టమ్‌ను కూడా మెరుగుపరుస్తుంది.