తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తొలగించారు. ఆ స్థానంలో కొప్పుల ఈశ్వర్ ను ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగింది. దీంతో కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా నుంచి లేఖ రాశారు. తాను అమెరికా రాగానే తనపై కుట్రలు ప్రారంభించారని మండిపడ్డారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు కార్మికుల సంక్షేమం కోసం ఏం చేశానో లేఖలో చెప్పారు. తాను రాసిన లేఖ లీక్ కావడంపై ప్రశ్నిస్తే తననే టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు.
అయితే కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి కవిత టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఇటీవలి కాలంలో యాక్టివ్ గా లేరు. జాగృతి తరపున సింగరేణి ప్రతి డివిజన్ లోనూ అధ్యక్షుల్ని నియమించుకున్నారు. సొంత కార్మిక వర్గం తరహాలో క్యాడర్ ను విస్తరింప చేసుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు ముందు జాగ్రత్తపడ్డారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘాన్ని కాపాడుకునేందుకు మంచి సమయం కోసం చూస్తున్నారు. కవిత అమెరికా వెళ్లిన వెంటనే.. కవితను గౌరవ అధ్యక్షురాలిగా తొలగించి.. కొప్పుల ఈశ్వర్ ను నియమించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ వ్యవహారం కేసీఆర్ ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాన్ని మరింత తీవ్రం చేస్తోంది. కవిత తన సొంత రాజకీయాన్ని ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వివక్షను ఆమె ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కవిత తీరుపై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆమె కలవడానికి వచ్చినా ఆసక్తి చూపించలేదు.