“విభజన రాజకీయాలు ఒక తాత్కాలిక విజయం కోసం దీర్ఘకాలిక ఐక్యతను త్యాగం చేసే వ్యాపారం.”
ఈ వ్యాపారంలో రాజకీయ పార్టీలు పండిపోయాయి. పురాతన కాలం నుంచి అదే చేస్తున్నాయి. సమాజంలో చైతన్యం పెరుగుతున్నకొద్దీ ఇలాంటివి తగ్గుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రజల విజ్ఞానాన్ని భావోద్వేగాలతో రెచ్చగొట్టి మళ్లీ వెనక్కి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల్ని విభజించి, పాలించే వ్యూహంలో రాజకీయ నేతలు పీహెచ్‌డీలు చేసేశారు. వారి ట్రాప్‌లో పడిన వారు మాత్రం ఇతరులపై అకారణ ద్వేషాలు పెంచుకుని మనుషులుగా బతకడానికి కష్టాలు పడాల్సి వస్తోంది. రాజకీయ నేతలు ఆడుతున్న వికృత ఆటలో ఇప్పుడు పావులు ఆర్యవైశ్యులు. వారి టార్గెట్ మార్వాడీలు. గో బ్యాక్ మార్వాడీ పేరుతో ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం లేవదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి ఆర్యవైశ్యుల్నే ముందు పెడుతున్నారు కొంత మంది. కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారాలు ఎక్కువగా ఆర్యవైశ్యులు చేస్తూంటారని.. వారి వ్యాపారాలను మార్వాడీలు ఆక్రమించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆర్యవైశ్యుల్ని కొంత మంది ఓ ఆయుధంగా ఉపయోగించుకుని సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు వివాదం ప్రారంభమయింది ఆర్యవైశ్యులు, మార్వాడీల మధ్య కాదు. ఇంకా చెప్పాలంటే అసలు కులాలు, వ్యాపారాల సమస్యతో కాదు. ఓ పార్కింగ్ సమస్యతో ప్రారంభమయింది. అది మెల్లగా రాజకీయనేతలకు అస్త్రంగా మారుతోంది. అందుకే మార్వాడీ గో బ్యాక్ నినాదంతో తమ మార్క్ రాజకీయాలు ప్రారంభించారు. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మార్వాడీ గో బ్యాక్ పేరుతో ప్రజల మధ్య విద్వేషం
మార్వాడీలు ఎక్కడ చూసినా కనిపిస్తూంటారు. హైదరాబాద్ లో ప్రతి మూలలో ఉంటారు. హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరానికి వెళ్లినా ఉంటారు. ఆంధ్రలో గుంటూరు.. అనంతపురం ప్రాంతాలకు వెళ్లినా ఉంటారు. ఎక్కడైనా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా వారికి చేతనయింది చిరు వ్యాపారం. అదే చేసుకుంటూ ఉంటారు. అందుకే వారు వ్యాపార ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటారు. మార్వాడీలు భారతదేశం అంతటా వ్యాపార అవకాశాల కోసం వలస వెళ్లారు, ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో కలకత్తా, బొంబాయి, మద్రాస్ వంటి వాణిజ్య కేంద్రాలకు వలస వెళ్లారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలలో మార్వాడీలు వ్యాపార కేంద్రాలుగా స్థిరపడ్డారు. నిజానికి వీరి ప్రభావం ఇప్పుడు చాలా వరకూ తగ్గిపోయింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో .. భారత్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించక ముందు ఆర్థిక వ్యవస్థలో వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. సంస్కరణలు ప్రారంభించిన తర్వాత వీరి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తగ్గిపోయింది. వీరి జనాభా స్వల్పమే. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మార్వాడీలు భారత జనాభాలో సుమారు 2 శాతం లేదా అంతకంటే తక్కువే ఉంటారు. వీరిలో ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్‌కు చెందిన వారు. దశాబ్దాలుగా వారు దేశం మొత్తం ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేయగలిగితే అక్కడికి వెళ్లి స్థిరపడటం అలవాటు చేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకుంటారు. కానీ తమ మార్వాడీ సంప్రదాయాలను మాత్రం మర్చిపోరు. అలాగే.. వారిలో ఐక్యత కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ సమస్య వీరు వ్యాపారాలు చేయడం కాదు. తమ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం ఏమిటని ఇప్పుడు విద్వేషాలను ప్రారంభిస్తున్నారు. వారి వల్ల తమ వ్యాపార అవకాశాలు దెబ్బతిన్నాయని..తాము నష్టపోతున్నామని అంటున్నారు.
గతంలో సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో ఆర్యవైశ్యులపై విషం
నిజానికి వీరు చేసేది వ్యాపారం. చారిటీ కాదు. నిర్బంధంగా అందరూ తమ వద్ద కొనాలని బెదిరించరు. మరి వారి వ్యాపారాలు విజయవంతం అవుతున్నాయంటే.. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనబట్టే. వీరు ఎలా వ్యాపారాలను చేస్తారన్నదాన్ని పక్కన పెడదాం.. ఇలా వారిని ఓ కులం పేరుతో వ్యతిరేకించి.. మా ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడం మాత్రం భారత రాజ్యాంగ మౌలికసూత్రాలను ఉల్లంఘించడమే. ప్రొఫెసర్ హరగోపాల్ అనే హక్కుల కార్యకర్త .. మార్వాడీలు తెలంగాణకు వచ్చి వ్యాపారాలు చేయడం వల్ల ఇక్కడ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని చెబుతున్నారు. ఇక్కడి భాషా, సంస్కృతుల్ని వారు కించపరుస్తున్నారని అంటున్నారు. ఆయన మావోయిస్టుల మద్దతుదారు అని అందరికీ తెలుసు . మావోయిస్టులు గిరిజన ప్రాంతాల్లో ఎంతో మంది ఆర్యవైశ్యలను ఇదే కారణంతో చంపిన ఘటనలు ఉన్నాయి. అప్పుడు ఈయన మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు. .. ఆంధ్రా వాళ్లపై ఇదే వాదన వినిపించారు. ఇలాంటి వారంతా మార్వాడీలపై యుద్ధానికి ఆర్యవైశ్యులనే ముందు పెడుతున్నారు.. కానీ కొన్నాళ్ల క్రితం కంచె ఐలయ్య అనే స్వయం ప్రకటిత మేదావి .. “ సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు” అనే పుస్తకం రాసి.. ఇదే ఆర్యవైశ్యలపై విషం చిమ్మారు. అప్పుడు కూడా ఇలాగే సమాజాన్ని రెండుగా విడగొట్టి ఆర్యవైశ్యులపై కొన్ని వర్గాలు దండెత్తేలా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆ పుస్తకానికి మద్దతు ఇచ్చిన వర్గాలు ఇవాళ మార్వాడీలపై అదే తరహా దాడి చేసేందుకు మద్దతిస్తున్నాయి. ఇందులో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా.. మావోయిస్టు మద్దతుదారులు ఉన్నారా.. రాజకీయ. పార్టీలు ఉన్నాయా అన్న సంగతి పక్కన పెడితే.. నాడు తమపై సమాజంలో ద్వేషం నింపే ప్రయత్నం చేశారని ఎలా అయితే ఆర్యవైశ్యులు మథనపడ్డారో.. ఇప్పుడు వారే మార్వాడీలపై అదే తరహాలో వ్యతిరేకత పెంచేందుకు ఆయుధంగా మారుతున్నారు. ఈ ట్రాప్ వారికి అర్థం కావడం లేదు. అందుకే.. మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు ముందుకు వస్తూ విద్వేషకారుల చేయి తడవకుండా.. పని చేసి పెడుతున్నారు.
ఈ ద్వేషం ఒకటి, రెండు వర్గాలతో ఆగేది కాదు.. ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమే !
నిన్న ఆర్యవైశ్యులపై విరుచుకుపడ్డారు.. ఇవాళ మార్వాడీ గో బ్యాక్ అంటున్నారు. రేపు ఇంకో వర్గంపై ఈ నినాదం తీసుకువస్తారు. రాజకీయ పార్టీలకు ఈ విభజన వాదం అనేది పెద్ద ఆయుధంగా మారింది. గట్టిగా చెప్పాలంటే తెలంగాణ వాదం కూడా ఇంతే. ఆంధ్రా వాళ్లు దోచుకుంటున్నారని ప్రచారం చేసి ఉద్యమం ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగింది. అయినా ఆ సక్సెస్ ఫుల్ ఫార్ములా ఇంకా వర్కవుట్ అవుతుందని ప్రయత్నిస్తూనే ఉన్నారు. పెద్దగా ఫలించడం లేదని అర్థం అయినప్పుడు ఇలా ఇతర వర్గాల మీద దాడి చేస్తున్నారు. మార్వాడీల మీద స్థానిక వ్యాపారులలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వారు వ్యాపారాన్ని దైవకార్యంగా చూస్తారు. ఇంట్లో అందరూ కష్టపడతారు. పిల్లలకు చదువుతో పాటు వ్యాపార మెళకువలు నేర్పిస్తారు. ఆడంబరాలకు పోయే కార్యక్రమాలు నిర్వహించరు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు. అదే వారి వ్యాపార విజయం కావొచ్చు. అలాంటి ఫార్ములాను స్థానిక వ్యాపారులు పాటిస్తే.. వారి కంటే ఎక్కువగానే వినియోగదారుఆదరణను చూరగొనవచ్చు. అదే వారిని ఓడించడానికి దగ్గర ఫార్ములా, ప్రజాస్వామ్యయుతమైన ఫార్ములా కూడా. వారిని వెళ్లగొట్టాలని.. వారిపై దాడులు చేయాలన్నట్లుగా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం సమాజానికి హానికరం. ఇప్పటికే సమాజంలో కమ్మ , రెడ్డి, కాపు అంటూ ఒకరిపై ఒకరిని ఎగదోసే రాజకీయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆయా వర్గాల మధ్య చిచ్చుపెట్టి.. తమ ఓటు బ్యాంకులుగా మార్చుకుని రాజకీయంగా బలపడుతున్న పార్టీలు.. వారిని శాశ్వత శత్రువులుగా మార్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఒకరిపై ఒకరికి విద్వేషాలు పెంచడానికి అదే పార్ములాతో గో బ్యాక్ అంటూ రెచ్చగొడతారు. ఇప్పటికే ఆధిపత్య కులాల పేరుతో కొన్ని కులాలను.. వ్యతిరేకించాలని.. తమవి బడుగు కులాలని కొందర్ని దశాబ్దాలుగా రెచ్చగొడుతూనే ఉన్నారు. నిజాలకి ఏది గొప్ప కులం.. ఏది తక్కువ కులం అని ఎవరూ చెప్పలేదు. కానీ చేసే వృత్తుల ఆధారంగా తక్కువ, ఎక్కువలు డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అన్ని పనులూ అందరూ చేస్తున్నారు. అయినా సరే ఈ కుల భావనలు మాత్రం తగ్గడం లేదు. సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్నా సరే.. ఎంత విజ్ఞాన వంతులవుతున్నా సరే.. కుల పిచ్చిలో దేశ ప్రజలు, యువత మునిగిపోవాలని చేసిన కుట్రలు ఇప్పటికీ ఫలిస్తున్నాయి. ఆ ఫలితం ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తోంది.
రాజకీయ పార్టీలు, విద్వేష శక్తుల కుట్రను ప్రజలే అర్థం చేసుకోవాలి !
ఈ విభజన వాదాలు యాధృచ్చికం కాదు. జరుగుతూనే ఉంటాయి. కులం, మతం, ప్రాంతం, వర్గాలు అనే ఆయుధాలను చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టి.. విభజన తీసుకు వచ్చి అండగా ఉంటామని వారికి నాయకులుగా తయారవుతున్నారు. నేడు బీసీ నినాదం పేరుతో జరుగుతున్న ఉద్యమాల్లో బీసీలు ఉండరు. వారి ఉద్యమాలకు వారు నాయకత్వం వహించరు. కానీ ఇలాంటి వారు ఇతరుల కోసం పోరాడుతారు. ప్రాంతం పేరుతో చేసిన రాజకీయాల దెబ్బకు తెలుగు వాళ్లు పూర్తిగా నష్టపోయారు. కలసి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అన్ని అగ్ర రాష్ట్రాలను అధిగమించి.. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో ఎదిగి ఉండేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాలను విభజించడంతో.. అనేక అంశాల్లో రెండు రాష్ట్రాలే పోటీ ఆడాల్సి వస్తోంది. ఓ కులంపై ద్వేషం నింపి ఎన్నికల్లో గెలిచే పార్టీలు వచ్చేశాయి. సమాజంలో ద్వేషాన్ని ఎలా నింపుతారో తెలుసుకుని చైతన్యవంతం కావాల్సి ఉందని అందరూ అంగీకరించాల్సిన అవసరం. కుగ్రామంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఎవరి అవకాశాల్ని ఎవరూ దోచుకోలేరు. ప్రతిభ, శ్రమ, సమైక్యత, తెలివి తేటలతో ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో అవకాశాలు ఉంటాయి. అందిపుచ్చుకోవడమే అసలైన విజేతల పని. అంతే కానీ పోటీ దారులు లేకపోతే మేమే విజేతలం అనుకుంటే.. అంత కంటే అమాయకులు ఉండరు.
అసలు మనిషికి ఓ ప్రాంతం అన్వయించవచ్చా ?
ఈ రోజుమార్వాడీ గో బ్యాక్ అని హైదరాబాద్ లో నిలబడి మాట్లాడుతున్న వారు నిజంగా ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు?. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రదేశం నుంచి..కాలనీ నుంచి.. ఉరు నుంచి వచ్చి ఉండరు. కాలగమనంలో ఉపాధి కోసం ఆయన తరలి వచ్చారు. అలా మాట్లాడేవాళ్లంతా అలా వచ్చిన వాళ్లే. మారుతున్న ప్రపంచంలో పుట్టిన చోటే ఎవరూ బతకడం లేదు. ఉద్యోగ , ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం దేశమంతటే కాదు.. ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. నేడు ఏ దేశానికి వెళ్లినా తెలుగు వాళ్లు కనిపిస్తారు. వారు ఉన్న చోట గో బ్యాక్ నినాదం వినిపిస్తే.. వారికి ఎలా ఉంటుంది ?. అందుకే సమాజాన్ని వీలైతే కలపాలి కానీ విభజించకూడదు. ప్రజలు కూడా ఇలాంటి కుట్రల్ని గమనించాలి.