తమిళనాట దళపతి విజయ్ రాజకీయం అంతా సినిమాటిక్ స్టైల్‌తోనే సాగుతోంది. తన ప్రసంగాల్లో డైలాగులే ఎక్కువ ఉంటున్నాయి. నిర్వహిస్తున్న సభలకు హైప్ కూడా అలాగే తెస్తున్నారు. గ్రాఫిక్స్ తో తమిళనాడు జనం అంతా సభకు వచ్చినట్లుగా వైరల్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. పాలిటిక్స్ రియాలిటీని ఆయన అర్థం చేసుకున్నారా లేదా అన్నదానిపైనే ఎన్నో సందేహాలు వస్తున్నాయి. స్టాలిన్ ను ప్రత్యర్థిగా ప్రకటించుకున్నంత మాత్రాన ఆయనకు ఓట్లు వేయరు. తమిళనాడు రాజకీయాల్లో పెనవేసుకుపోయిన వర్గ రాజకీయాలను ఆయన సమన్వయం చేసుకోకపోతే మరో విజయకాంత్ అవుతారు తప్ప.. కింగ్ కాలేరు.
డీఎంకే భావజాలమే… ఇక ప్రత్యామ్నాయం ఎలా అవుతారు?
విజయ్ తనకు బీజేపీ భావజాల శత్రువు అని చెప్పారు. డీఎంకే రాజకీయ శత్రువు అన్నారు. అక్కడే ఆయన తమిళనాడు ప్రజల్ని గందరగోళానికి గురి చేశారు. డీఎంకే భావజాలం, విజయ్ భావజాలం ఒక్కటే అని ఆయన అంగీకరించినట్లు అయింది. హిందీని వ్యతిరేకిస్తానని చెప్పారు. ఇప్పటికే ద్విభాషా విధానాన్ని స్టాలిన్ ప్రకటించారు. ఇతర అన్ని విషయాల్లోనూ డీఎంకేనే ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ డీఎంకేకు ప్రత్యామ్నాయం అవ్వాలంటే ఆయన ఎందుకో చెప్పాల్సి ఉంది. కానీ చెప్పలేకపోతున్నారు.
తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో తేలిపోయిన విజయ్
పూర్తి స్థాయిలో సినిమాటిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ప్రసంగాలు డైలాగులుగానే సాగుతున్నాయి. తల్లిదండ్రులతో విబేధాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చేందుకు .. వారిని మధురై సభా వేదిక మీద ఆసీనులు చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్ని చోట్లా తానే అభ్యర్థినని చెప్పుకున్నారు. అందర్నీ సామాన్యులనే నిలబెడతానని ప్రకటించారు. అంతా వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారు తప్ప అసలైన రాజకీయ సమీకరణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారు.
డీఎంకే, అన్నాడీఎంకేల పోల్చుకుంటున్న విజయ్ – కాలం మారింది !
తనను డీఎంకే, అన్నాడీఎంలకే పోల్చుకున్నారు. ఆయా పార్టీలు పెట్టినప్పుడు ఎలాంటి విజయాలు సాధించాయో.. అలాగే విజయం సాధిస్తానని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఒంటరి పోటీ అనేది రాజకీయంగా సూసైడ్ ప్రయత్నం లాంటిది. ఏవైనా కూటములుగా పోటీ చేస్తాయి. ఎందుకంటే ప్రతి కులానికి ఓ పార్టీ ఉంది. ఆయా పార్టీలు ఆ కులాల్లో ఎంతో కొంత పలుకుబడి సాధించి ఓట్ల వేటలో ముందడుగు వేస్తున్నాయి. వాటన్నింటినీ కలుపుకుని ముందుకుపోతేనే విజయం వస్తుంది. అంత పెద్ద జయలలిత కూడా ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. చాలా పార్టీలను కలుపుకునే పోటీ చేసేవారు. కరుణానిధి కూడా అంతే. విజయ్ కు ..పొత్తుల కోసం వచ్చిన అవకాశాలు దూరమయ్యాయి. ఆయన వాటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఒంటరి పోటీ అని.. తానే అభ్యర్థినని చెబుతున్నారు. భారీ బహిరంగసభలు, సినిమాటిక్ డైలాగులతో రాజకీయంగా ఓట్లు పడే కాలం తమిళనాడులోనూ మారిపోయిందని విజయ్ కాంత్ నుంచి కమల్ వరకూ నిరూపించారు. మరి విజయ్ ఏం చేయాలనుకుంటున్నారు ?