ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో లగ్జరీ హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. ఈ ట్రెండ్ 2025లో ముఖ్యంగా టియర్-1 సిటీలలో ఎక్కువగా ఉంది. దీనికి కారణంగా బిల్డర్లతో పాటు పెరుగుతున్న అధిక ఆదాయ వర్గాల ఇళ్ల కొనుగోలు, వారి లగ్జరీ ఆసక్తుల్ని కారణంగా చెప్పుకోవచ్చు.
2025 మొదటి అర్ధభాగంలో ప్రీమియం హోమ్స్ అంటే కోటి పైబడిన ఇళ్ల మార్కెట్ షేర్ 62%కి చేరింది, ఇది మునుపటి సంవత్సరం అదే కాలంలో 51 శాతం ఉంది. అఫోర్డబుల్ సెగ్మెంట్ లో అంటే 1 కోటి కంటే తక్కువ ఉన్న ఇళ్ల వాటా 38 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇది 41 శాతం ఉండేది. 3-5 కోట్ల రేంజ్లోని ఇళ్లకు డిమాండ్ 14 శాతం పెరిగింది.ఎక్కువ మార్జిన్ల కోసం డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. అఫోర్డబుల్ సెగ్మెంట్లో మార్జిన్లు తక్కువ. కన్స్ట్రక్షన్ ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకే బిల్డర్లు.. లగ్జరీ ఇళ్లు కట్టి లాభాలు సంపాదించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ కారణంగా మిడిల్-క్లాస్ తో పాటు మొదటి సారి ఇళ్లు కొనాలనుకునేవారికి చాయిస్ తగ్గుతోంది. అయితే మార్కెట్ అందుబాటు ధరల ఇళ్ల కోసం ఓపెన్ గా ఉంది. డిమాండ్ బాగా ఉంటుందని తెలిసినా బిల్డర్లు పట్టించుకోకపోవడంతో.. ఇళ్లు కొనాలనే ఆలోచన వాయిదా వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. బిల్డర్లు ఆలోచనల్లో మార్పు వస్తే.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇళ్లు కొనేందుకు ముందుకు వచ్చే చాన్స్ ఉంది.