ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించిన పూరి జగన్నాథ్… ఆ తరవాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ తో బోల్తా పడ్డారు. ఈ రెండు సినిమాలు పూరిని బాగా ఇబ్బంది పెట్టాయి. ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి డిసైడ్ అయ్యారు. తన మేకింగ్ స్టైల్, పద్ధతులు అన్నీ మార్చుకొని, పాత పూరిని మళ్లీ బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా విజయ్ సేతుపతితో ఓ సినిమా పట్టాలెక్కించారు పూరి. కాంబినేషన్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఇది. కథా పరంగా కూడా పూరి చాలా శ్రద్ధ పెట్టాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కొంత మేర షూటింగ్ అయ్యింది. రషెష్ చూసుకొన్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈసారి గట్టిగా కొడుతున్నాం అని తన సన్నిహితులకు నమ్మకంగా చెబుతున్నాడట. ఈ చిత్రం కోసం ‘బెగ్గర్’, ‘భవతీ భిక్షాందేహీ’ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాతో పాటుగా మరో రెండు కథల్ని కూడా లాక్ చేసుకొన్నాడు పూరి. ఓ సినిమాలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది. శివ కార్తికేయన్, సూర్య.. ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉంది. మరో కథ తెలుగులో ఓ యూత్ స్టార్‌కి వినిపించబోతున్నాడని సమాచారం. విజయ్ సేతుపతి సినిమా సెట్స్ పై ఉండగానే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్మెంట్ బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి.