చిన్న సినిమాలకు రివ్యూలు హెల్ప్ అవుతాయి. మంచి రేటింగ్స్ వస్తే ఆ రేటింగ్స్‌ని చూపిస్తూ ప్రచారాన్ని ఇంకాస్త ముందుకు నడిపి జనాన్ని థియేటర్స్‌లోకి రప్పించే అవకాశం ఉంటుంది. పరదా సినిమా యూనిట్ కూడా రివ్యూస్‌పై చాలా నమ్మకాలు పెట్టుకుంది. మహిళలు ఎదుర్కొనే కొన్ని సమస్యలపై సినిమా తీస్తున్నాం కాబట్టి తప్పకుండా క్రిటిక్స్ ఎంపతైజ్ అవుతారని భావించారు. అందుకే “రివ్యూస్ చూసే థియేటర్స్‌కి వెళ్ళండి” అనే స్లోగన్ ఇచ్చారు. అయితే వాళ్ల అంచనా తేడా కొట్టేసింది. పరదా సినిమాకి సరైన రివ్యూ రాలేదు. ఆసక్తి లేని కథనాలపై చాలామంది విమర్శకులు పెదవి విరిచారు. దర్శకుడి ప్రయత్నంలో చాలా లోపాలు కనిపించాయని వివరించి రాశారు.
రివ్యూలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు సినిమా యూనిట్ కొత్త నినాదం అందుకుంది. “మంచి సినిమాని ప్రేమించే ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడండి. సినిమాకి ఇలాంటి రివ్యూలు ఎందుకు వచ్చాయని మీరే సర్ప్రైజ్ అవుతారు” అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇకపోతే డైరెక్టర్ ప్రవీణ్ ఓపెన్‌గానే కొన్ని విషయాలు అంగీకరించాడు. ఈ సినిమాలో తప్పులు ఉన్నాయని, రివ్యూ రైటర్లు తప్పుల గురించి రాశారని, “నేను మనిషినే, తప్పులు చేస్తాను”.. ఇలా కొంచెం ఎమోషనల్ అవుతూనే బ్యాలెన్స్‌గానే మాట్లాడారు.
కాకపోతే అనుపమ మాత్రం కాస్త ఆవేశపడింది. అసహనంతో కూడిన ఆవేశం ఆమె మాటల్లో కనిపించింది. దర్శకుడిని వెనకేసుకొచ్చింది. “మీరెందుకు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు? కొంతమందికి ఇలాంటి సినిమాలు నచ్చవు. అది వాళ్ల ఇష్టం. మీరేం తప్పు చేయలేదు. కమర్షియల్ చిత్రంలో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు. కానీ, ఫిమేల్ చిత్రాల విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది’ అంటూ రివ్యూల మీద తన అసహనాన్ని కాస్త ఘాటుగానే వ్యక్తపరిచింది.
“ఇదొక వైన్ లాంటి సినిమా, స్లో పాయిజన్… మెల్ల మెల్లగా జనాలకి ఎక్కుతుంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది అనుపమ.
అనుపమ ఆశపెట్టుకోవడంలో తప్పులేదు. సినిమా ఆడాలనే అందరూ కోరుకుంటారు. కానీ రోజులు మారిపోయాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత జాతకం తేలిపోతుంది. నెగిటివ్ టాక్ వచ్చాక మళ్లీ ట్రాక్ ఎక్కడం అనేది జరగడం లేదు. వార్ 2, కూలీ లాంటి సినిమాలే పుంజుకోలేకపోయిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో థియేటర్ రన్లో స్లో పాయిజన్ లాంటి హిట్లు ఊహించడం కూడా కష్టమే.