పేద , మధ్యతరగతి కుటుంబాలకు అతి పెద్ద సమస్య సంపాదన పరుడు ఒక్కరే ఉండటం. ఇంటి పెద్ద మాత్రమే సంపాదిస్తాడు.. ఆయనకు ఏమైనా సమస్య వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. మహిళలకు కష్టపడాలని ఉన్నా అవకాశాలు దొరకవు. ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల సమస్యను మంత్రి నారా లోకేష్ గమనించారు. అందుకే మహిళలకూ ఆర్థిక పరంగా మేలు జరిగే ఉపాధిని కల్పించే ప్రయత్నాలకు పదును పెట్టారు. అభిరుచి ఉన్న రంగాల్లో మహిళలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
నగరాల్లో ర్యాపిడో డ్రైవర్లుగా మహిళలు
కొత్త కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుని.. ఖాళీ సమయంలోనే పని చేసి..కుటుంబానికి ఆర్థికంగా అంతో ఇంతో ఆసరగా ఉండాలనుకునే మహిళ ల కోసం లోకేష్ చేసిన ఆలోచనల్లో ఒకటి ర్యాపిడో డ్రైవర్లు. ఏపీలోని విశాఖ, విజయవాడ, నెల్లూరు , తిరుపతి వంటి చోట్ల.. మహిళలకు ర్యాపిడో డ్రైవర్లుగా అవకాశం కల్పించారు. సబ్సిడీతో ఎలక్ట్రిక్ బైకులు ఇప్పించారు. ర్యాపిడోతో మాట్లాడి ఫ్లాట్ ఫాం ఫీజు తగ్గించేలా చేశారు. ఇప్పుడు ఆ మహిళలు విజయవంతమయ్యారు. వెయ్యి మందికిపైగా మహిళలు ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్లుగా తమ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు.
స్ఫూర్తిగా నిలుస్తున్న సక్సెస్ స్టోరీస్
ఉద్యోగం అంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అని.. ఉపాధి అంటే.. ఇస్త్రీ షర్ట్ నలగకుండా వ్యాపారమని అనుకుంటే.. ఎక్కడి వాళ్లు అక్కడే ఉంటారు. జీవనాన్ని మెరుగుపరచుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాల్ని ఉపయోగించుకుని పొందే ప్రతి ఉపాధి అద్భుతమే అవుతుంది. అలాంటి ఉపాధిని సీరియస్ గా చేస్తే ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. మధ్యతరగతి ప్రజలు ఇలాంటి ఆవకాశాల కోసమే చూస్తూంటారు. చుట్టూ చాలా అవకాశాలు ఉన్నా… అవి ఉన్నాయని తెలిసే వ్యవస్థలు సరిగ్గా లేవు. అందుకే మధ్యతరగతి ఎక్కువగా ఉపాధి సమస్యల్లో ఉండిపోతున్నారు. ఇలాంటి వారి సమస్యలను తీర్చాలని నారా లోకేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
మహిళా శక్తి విజృంభిస్తే.. ఉన్నత స్థాయికి కుటుంబాలు
కుటుంబాలకు ఆసరాగా ఉండే విషయంలో.. మహిళ ల పాత్ర కీలకం. వారు ఆర్థికపరంగా కూడా కుటుంబ బాధ్యతలు తీసుకున్నారంటే ఆ కుటుంబం ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. మహిళలను మరింత క్రియాశీలకం చేసేందుకు నారా లోకేష్ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. విభిన్నరంగాల్లో ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో మహిళా ఉపాధి విప్లవం చూడొచ్చని అనుకోవచ్చు.