తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన తాడిపత్రికి పోవచ్చని తెలిపింది. భద్రతా సమస్యలు ఉంటే ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే పోలీసులు సెక్యూరిటీ ఇస్తే .. ఖర్చులు తాము పెట్టుకుంటామని పెద్దారెడ్డి లాయర్ చెప్పారు. దీంతో పెద్దారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లయింది. హైకోర్టు బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది.
సుప్రీంకోర్టులో ఈ ఊరట లభించేలా చేసింది ఎవరో కాదు.. వైసీపీ ఏస్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పిటిషన్ విషయంలో ప్రధాన వాదనలు సిద్ధార్థ దవే అనే లాయర్ వాదనలు వినిపించారు. ఆయనతో పాటుగా లాయర్ల జాబితాలో పొన్నవోలు పేరు కూడా ఉంది. ఆయన ఏమైనా .. మిలార్డ్ అని గొంతు సవరించుకున్నారో లేదో కానీ బయటకు వచ్చి మాత్రం.. మీడియా ముందు కాలర్ ఎరగేశారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్తున్నామన్నారు.
నిజానికి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఎవరూ చెప్పడం లేదు. ఆయన వెళ్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని.. పోలీసులు చెబుతున్నారు. మాములుగా అయితే ఏ సమస్యా ఉండేది కాదు..కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన నిర్వాకాలతోనే సమస్యలు వచ్చాయి. తాడిపత్రి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆయన నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదు. కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఊరు ఉంటుంది. అయితే మున్సిపల్ స్థలం ఆక్రమించుకుని తాడిపత్రిలో ఇల్లు కట్టారని టీడీపీ నేతుల ఆరోపిస్తున్నారు.
సుప్రీంకోర్టు పూర్తి స్థాయి ఉత్తర్వుల్లోఏమి ఉంటుందో కానీ.. ఆయన తాడిపత్రికి వెళ్లాలనుకున్న రోజున.. ఉద్రిక్తత ఏర్పడటం ఖాయమని అనుకోవచ్చు.