కాంగ్రెస్ పార్టీ రాజాసింగ్ గా మారిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాను ఇక అసెంబ్లీకి రానని శపథం చేశారు. ఒక్క రోజు మాత్రమే వస్తానని ఇక నుంచి రానని.. మీడియా ప్రతినిధులకు చెప్పారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవడానికి తాను కామారెడ్డికి వెళ్తానన్నారు. తన అనుచరులతో కలిసి కామారెడ్డికి వెళ్లి ప్రజలకు సాయం చేస్తానని చెప్పుకొచ్చారు.
రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితుల్ని పట్టించుకోకుండా.. ఇలా అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం రిపోర్టులని రాజకీయం చేస్తున్నారని చెప్పడం. అందుకే తాను వెళ్లి సాయం చేస్తానన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఆయన కుబేరుడు. ఇవ్వాలనుకుంటే.. ముందుగానే కామారెడ్డికి వెళ్లి కావాల్సినంత సాయం అక్కడి ప్రజలకు ఇచ్చి రావొచ్చు. కానీ ఇవాళ వరకూ అక్కడి ప్రజల గురించి ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎగ్గొట్టడానికి తనకు ఓ కారణం కావాలి కాబట్టి ఇలా చెప్పుకున్నారు.
మంత్రి పదవికి సీఎం రేవంతే అడ్డం ఉన్నారని రాజగోపాల్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేశారు. కానీ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం.. కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వేచి చూస్తున్నారో.. లేకపోతే ఎమ్మెల్యే కాబట్టి కాంగ్రెస్ లో ఆ స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నారో కానీ సైలెంట్ గా ఉంటున్నారు. అది కోమటిరెడ్డికి మరింత బలాన్నిస్తోంది.