హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు మౌన వ్యూహం పాటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి అధికారికంగా, అనధికారికంగా ఒక్క స్పందన కూడా రాలేదు. హరీష్ రావుకు తమ మద్దతు ఉంటుందన్న పరోక్ష సంకేతాలను పంపడానికి ఆయనను ఆరు అడుగుల బుల్లెట్టు అని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. కేటీఆర్ దానికి మరిన్ని పొగడ్తలు జత చేసి రీట్వీట్ చేశారు . అంతే కానీ కవిత ఆరోపణలను ఖండించడం కానీ.. తిరస్కరించడం కానీ చేయలేదు.
కవిత ఆరోపణల్ని ఖండిస్తే.. మరింత ప్రచారం జరుగుతుందని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటివి అవసరం లేదని.. అదే టాపిక్ గా ఉండే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఎవరూ మాట్లాడవద్దని సందేశాలు పంపినట్లుగా తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉన్నది హరీష్ రావుపైనే. ఆయనపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు రాలేదు.
కానీ కవిత కాళేశ్వరం అవినీతికి ఆయనే కారణం అని.. ఆయనే పెద్ద ఎత్తున దోచుకున్నాడని కూడా తేల్చేశారు. అందుకే కేసీఆర్ ఇరిగేషన్ మినిస్ట్రీ నుంచి తప్పించారని కూడా ఓ సాక్ష్యం చూపించారు. కవిత మాటలు శుద్ధ అబద్దాలని.. హరీష్ రావు అంటే ఓ నమ్మకం.. ఓ విశ్వాసం అని బీఆర్ఎస్ వైపు నుంచి స్పష్టత రాలేదు. హరీష్ రావు తన కుమార్తెను కాలేజీలో చేర్పించడానికి లండన్ వెళ్లారు. ఆదివారం తెల్లవారు జాము వరకూ అసెంబ్లీ వ్యవహారాలతో బిజీగా ఉన్నా.. వెంటనే కుమార్తెను తీసుకుని లండన్ బయలుదేరి వెళ్లారు.
ఆయన అక్కడ దిగినప్పుడే కవిత ఇక్కడ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తప్పు అని బీఆర్ఎస్ వైపు నుంచి ఖండనలు రాకపోవడం ఆయన వర్గాన్ని కొంత అసంతృప్తికి గురి చేస్తోంది. ఏదో పొగుడుతూ రెండు ట్వీట్లు పెట్టడం ఖాయని.. కవిత చల్లిన బురద తుడవాలని ఆయన కోరుకుంటున్నారు. అలా చేయడం వల్ల సమస్య పెద్దదవుతుందని ప్రస్తుతానికి సైలెంటుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.