హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్,కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు.
కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని.. ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు అరవై లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు .. హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని.. హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే.. ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు.
కేసీఆర్ వెంట.. హరీష్ మొదటినుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు ..వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని…డబుల్ షూటర్ అని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్ , సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్,సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తనదని.. తాను ఇరవై ఏళ్లు పార్టీ కోసం పని చేశానన్నారు. బీఆర్ఎస్ తన శరీరం అయితే.. జాగృతి తన ఆత్మ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీకి..ఎమ్మెల్సీ కి రాజీనామా ప్రకటించారు.