వైసీపీ పెద్జ నేతలు అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరగాలనుకుంటారు. కానీ ఆ ప్లాన్ అమలు చేసేవాళ్లు వాళ్లదైనా స్టైల్లో చేసి మొత్తం చేయకూడని గండం తెచ్చి పెడతారు. ఇప్పుడు ఇలాంటిదే వైసీపీ ఎదుర్కోంటోంది. ఆ గండం .. బిర్యానీతో వచ్చింది.
ఇటీవల వైఎస్ చనిపోయిన రోజు వేడుకల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆఫీసు నుంచి అన్ని నియోజకవర్గాలకు ఆదేశాలు వెళ్లాయి. రాజన్నను ఘనంగా స్మరించుకుని బిర్యానీ దానాలు చేయమని సలహాలు ఇచ్చారు. డబ్బులు దండగ అనుకున్న వారు చేయలేదు కానీ.. చేయకపోతే ఏమనుకుంటారో అనుకున్నవాళ్లు చేశారు. అలాంటి వారిలో ఒకరు నందిగామ మాజీ ఎమ్మెల్యే.
ఆయన చికెన్ బిర్యానీలు వండించి .. అందరికీ భోజనాలు పెట్టారు. వైఎస్ వర్థంతిని సెలబ్రేట్ చేశారు. కానీ ఆయన ఈ సెలబ్రేషన్ వినాయక మండపం ప్రాంగణంలో చేశారు. హవ్వ.. గణేశ్ మండపంలో చికెన్ బిర్యానీ భోజనం పెడతారా అని పోలీసులు అడ్డుకున్నా.. ఆ మండపం తాము ఏర్పాటు చేయలేదని వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా.. ఇప్పుడు జాతీయ స్థాయి అంశం అయిపోయింది. వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలపై జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది.
ఇప్పుడు బీజేపీ నేతలు .. జగన్ రెడ్డి జాతీయ స్థాయిలో తమ కాళ్లు పట్టేసుకుని వదలమన్నా వదలేట్లేదన్న సానుభూతి కూడా చూపించకుండా.. వైసీపీ పార్టీపై దండెత్తుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఆలయాలపై దాడుల నుంచి అన్నీ ఘటనలను వెలికి తీసి ఆ పార్టీని ఎలా క్షమించాలంటూ.. కేంద్ర మంత్రి వర్మ నుంచి అధ్యక్షుడు మాధవ్ వరకూ అందరూ ఒకే రకమైన ట్వీట్ పెట్టి దాడి చేస్తున్నారు.
గణేష్ మండపం ప్రాంగణంలో చికెన్ బిర్యానీ పెట్టాలని సజ్జల ఆఫీసు నుంచి చెప్పి ఉండరు.కానీ బిర్యానీ పెట్టమని చెప్పి ఉంటారు. కానీ దాన్ని ఇలా చేసుకుని మొండితోక బ్రదర్స్ జగన్ తోక కత్తిరించే పరిస్థితి తెచ్చారు.
