“ పెన్షన్లు ఇప్పటికే మూడు వేలు ఇస్తున్నాం.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత రూ.250 పెంచుతాం “ అని జగన్ రెడ్డి మేనిఫెస్టోలో ఎన్నికల హామీ. కానీ కూటమి .. అధికారంలోకి రాగానే పెన్షన్లు నాలుగువేలు చేస్తామని.. తొలి నెలలో రెండు నెలల బకాయిలు కలిపి ఏడు వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జగన్ రెడ్డి.. నా దగ్గర ఉన్న ఖజానా గురించి నాకు తెలుసు.. చంద్రబాబు ఇవ్వలేరన్నారు. కానీ అనుకున్నట్లుగా ఇచ్చేశారు. నిరాటంకంగా ఇస్తున్నారు. అదొక్కటేనా.. చెప్పినట్లుగా అన్ని పథకాలను.. ఏడాదిలోపు అమల్లోకి తెచ్చారు. సూపర్ సిక్స్ ను .. ప్రజల్లోకి తీసుకెళ్లారు. పేదలందరికీ లబ్ది కలిగిస్తున్నారు.
జగన్ సాధ్యం కాదని చెప్పిన సూపర్ సిక్స్
టీడీపీ రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు మోసం చేస్తున్నారని అవి సాధ్యం కాదన్నారు. కానీ ఇవాళ అన్ని పథకాల పకడ్బందీగా అమలవుతున్న విధానం చూసి వైసీపీ పెద్దలు కూడా మనకు చేత కాదు.. చంద్రబాబుకు చేతనవుతుందని అంగీకరించక తప్పని పరిస్థితి. అన్న క్యాంటీన్లు, పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు హామీల్లో అత్యంత ప్రధానమైనవి. ఇవి ఇప్పటికే అమలవుతున్నాయి. అర్హులైన అందరికీ లబ్ది చేకూరుస్తున్నాయి. ప్రజా జీవితాలను వీలైనంత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి.
సమస్యలు లేకుండా అమలు
ఇటీవల ఉచిత బస్సుపై ఏడుస్తూ జగన్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టారు. కానీ అందులో ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసినా… పథకాలు అర్హులు అందరికీ అందుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. విద్యార్తుల్లో 80 శాతం మందికి తల్లికి వందనం జమ అయినట్లుగా అంగీకరించారు. మిగిలిన ఇరవై శాతం మంది పథకం అవసరం లేని ధనవంతులు. ఇక ఉచిత బస్సు పథకాన్ని 70 శాతం బస్సుల్లోనే అమలు చేస్తున్నారని జగన్ ఏడ్చారు. నిజంగా ఉచిత బస్సు కావాలనుకునేవాళ్లు ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు కోరుకోరు. వారి దైనందిన జీవితంలో రవాణా ఖర్చు మిగిలితే చాలని అనుకుంటారు. ఇలా అన్ని రంగాలను ఆదుకునే సమగ్ర పథకాలుగా సూపర్ సిక్స్ నిలిచాయి.
సమర్థ ప్రభుత్వానికి ప్రజలే రక్ష
ఎన్నో అర్థిక సమస్యలు ఉండి.. ఓ సునామీ లాంటి పరిపాలన తర్వాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇచ్చిన హమీలను సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రజలు ఇచ్చిన బలంతోనే ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సాయం తెచ్చుకునే వెసులుబాటు ప్రజలు ఇచ్చిన బలం వల్ల సాధ్యం అయింది. చంద్రబాబు మరింత చురుకుగా పని చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. ప్రజా కోణంలోనేసాగుతున్న పరిపాలన..పథకాల అమలు ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తాయి.
కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్న పథకాల విజయంలో భాగంగా అనంతపురంలో విజయోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం.. ప్రజలకు తమకు కల్పించిన అవకాశానికి కృతజ్ఞతలు చెబుతారు. ప్రజల వల్లనే ఇది సాధ్యమయింది మరి.. !