జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కసరత్తును కేటీఆర్ ప్రారంభించారు. పార్టీ నేతలు,కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాగంటి గోపీనాథ్ కుటుంబం ఇంకా సెటిల్ కాలేదని.. ఆ కుటుంబానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అంటే.. మాగంటి కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ చేసిందని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
జూబ్లిహిల్స్ ఎన్నిక బీఆర్ఎస్కు లిట్మస్ టెస్టు లాంటిది. మజ్లిస్ మద్దతు కూడా ఉండదు. ఇలాంటి సమయంలో జూబ్లిహిల్స్ లో గెలవకపోతే.. కనీసం గట్టి పోటీ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్న అభిప్రాయానికి రాజకీయం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే కేటీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సానుభూతి పవనాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. క్యాడర్ ఇతర పార్టీల్లో చేరిపోవడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా లోకల్ గా ఉండే బలమైన యువనేతను నిలబెడతారన్న ప్రచారంతో కేటీఆర్ మరింత అలర్ట్ అయ్యారు.
అయితే అర్బన్ ఏరియాల్లో.. సానుభూతి ఎంత మేర పని చేస్తుందన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే చనిపోయినా..ఆమె సోదరికే టిక్కెట్ ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందుకే జూబ్లిహిల్స్ లో సానుభూతి కన్నా.. పార్టీల బలాబలాలపైనే ఎక్కువగా పోరాటం ఉంటుందని భావిస్తున్నారు.