నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఏపీకి తీసుకు రావడానికి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. చిక్కుకున్న వారందరూ ఏపీకి చేరుకున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం తక్షణమే స్పందించి వారితో సమన్వయం చేసుకున్నారు నారా లోకేష్. అందర్నీ ఒక చోటికి చేర్తి వారి కోసం ప్రత్యేక విమానం పంపించారు. వారంతా విమానంలో ఏపీకి చేరుకున్నారు. ఎక్కువ మందిని విశాఖలో.. మరికొంత మందిని తిరుపతిలో దింపారు. విమానంలో ప్రయాణికులు జయహో చంద్రబాబు జయహో నారా లోకేష్ నినాదాలతో హోరెత్తించిన వీడియో వైరల్ అయింది.
తెలుగువారి సంక్షేమం కోసం ఎప్పటికీ మొదటి స్థానంలో నిలబడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి తన స్పందనా సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లయింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఉత్తరాఖండ్, సిమ్లా వంటి ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాల్లో తీసుకు వచ్చిన చరిత్ర టీడీపీకి ఉంది. 2014లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సిమ్లాలో బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు అయిన ఘటనలోనూ టీడీపీ చురుగ్గా స్పందించి బాధితులకు అండగా నిలిచింది. అధికారంలో లేనప్పుడు కూడా.. పార్టీ సానుభూతిపరుల సాయంతో.. బాధితులకు అండగానే నిలిచింది.
నారా లోకేష్ చేసిన ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తే.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఇదంతా కేంద్రం చేయాల్సిన పని అని..నారా లోకేష్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సన్నాహాలు,సహాయ చర్యలు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ఢిల్లీ వరకూ తీసుకొచ్చి వదిలి పెడుతుంది. అయినా కేంద్రంతో సమన్వయం చేసుకుని ఏపీ వాసులందర్నీ తీసుకొచ్చింది ప్రభుత్వం. దీన్ని గుర్తించడానికి వైసీపీ నేతలకు మనసు రావడం లేదు.