సునీల్ రెడ్డి అనే అతని కంపెనీలు, ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆయన కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశాడని ఇప్పటికే ఆధారాలు సేకరించారు. అసలు ఈ సునీల్ రెడ్డి ఎవరు అనేది తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఆయన జగన్ రెడ్డి ఇంట్లో పాలేరు. ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, వస్తువులు తెచ్చే పనిని వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చేసేవారు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఆయన దగ్గరే ఉంచేవారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా పాలేరు ముదిరి మనీ లాండరర్ అయ్యారు.
జగన్ సేవల కోసం బెయిల్ వద్దనుకుని జైల్లో ఉన్న సునీల్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుటుంబానికి .. నమ్మిన బంటుగా ఉండటంతో ఆయన పేరు మీదా స్కాములు చేశారు. ఎమ్మార్ స్కామ్ లో ఆయన పేరు మీద స్కాములు చేయడంతో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు అయ్యారు. ఎమ్మార్ స్కామ్ లో ఇతర నిందితులతో పాటు బెయిల్ వచ్చినా ఆయన బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే.. జగన్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు సేవలు చేయడానికి బయటకు వెళ్లలేదు. జగన్ జైలు నుంచి వచ్చాకనే ఆయన బయటకు వచ్చారు.
జగన్ సీఎం కాగానే కంపెనీల మీద కంపెనీలు
జగన్ సీఎం అయ్యాక..సునీల్ రెడ్డి పని మనీ లాండరింగ్ చేయడమే. అందు కోసం కంపెనీల మీద కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన పేరు మీద ఎక్స్ పర్ట్స్ చేసేవారు. మొదట్లో విజయసాయిరెడ్డి.. తర్వాత బాలాజీ గోవిందప్ప లాంటి వారు సునీల్ రెడ్డితో కంపెనీలు పెట్టించి.. మనీలాండరింగ్ చేసి.. వాటిని వైట్ రూపంలో తెచ్చుకుని ఆ కంపెనీల్ని మూసేసేవారు. ఎంతలా అంటే.. చివరికి వైజాగ్ పోర్టులో కూడా ఓ కంపెనీ పెట్టేశారు. ఆ కంపెనీ ద్వారా ఏమేం ఇతర దేశాలకు పంపించారో తేలాల్సి ఉంది. సునీల్ రెడ్డి వ్యవహారంపై ముందుగానే సిట్ స్పష్టమైన ఆధారాలు బయటకు తీసింది. ఎంపీ లావు.. పార్లమెంట్ లో అందరి ముందు పెట్టారు.
వైఎస్ భారతి ఆదేశాల మేరకే !
సునీల్ రెడ్డి పూర్తిగా వైఎస్ భారతి కుటుంబానికి సన్నిహితుడు. వారి తరపున బంధుత్వం కూడా ఉందని చెబుతారు. భారతి చెప్పే ఆర్థిక వ్యవహారాలన్నింటినీ సునీల్ రెడ్డి చక్క బెడతారని చెబుతారు. ఇప్పుడు సునీల్ రెడ్డి నిర్వాకం గురించి మొత్తం సిట్ బయటకు తీస్తే.. అసలు లింకులు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో పని వాళ్లను.. నమ్మకస్తులను పెట్టి.. స్కాములు చేయడంలో జగన్ ఆరితేరిపోయారు.
