వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో జరిగిన ఆయేషా మీరా అనే విద్యార్థిని హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్లీ సత్యంబాబు వద్దకే వచ్చినట్లుగా తెలుస్తోంది. సీబీఐ జరిపిన విచారణలోనూ సత్యంబాబు వైపే అనుమానాలు కలిగేలా ఆధారాలు లభించడంతో సీబీఐ కోర్టుకు నివేదిక సమర్పించారు ఆ నివేదిక ఆధారంగా రేప్, హత్య సెక్షన్ల కింద సత్యంబాబుపై మళ్లీ కేసులు పెడుతున్నారని.. దీనిపై అభిప్రాయం చెప్పాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.
2007లో జరిగిన ఆయేషా మీరా హత్య కేసు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో పోలీసులు సత్యంబాబును పట్టుకుని దిగువకోర్టులో కేసును నిరూపించారు. దాంతో సత్యంబాబుకు యావజ్జీవ శిక్ష పడింది. కానీ హైకోర్టులో సరైన సాక్ష్యాలు లేవని.. ఆ శిక్షను రద్దు చేశారు. దాంతో సత్యంబాబు విడుదలయ్యారు. అప్పుడే కేసును సీబీఐకి ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపి నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఆ నివేదికలోనూ సత్యంబాబువైపే ఎక్కువగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయనపై మళ్లీ రేప్, హత్య కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లుగా కనపిస్తోంది.
అయితే ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం.. సత్యంబాబు నిర్దోషి అనేదే తమ అభిప్రాయమని అంటున్నారు. అప్పట్లో వైసీపీకి చెందిన ఓ మంత్రి మనవడుపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయనపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. తమ కుమార్తెకు సీబీఐ కూడా న్యాయం చేయడం లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు అంటున్నారు.