ఏపీలో పోలీసు వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం డీజీపీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కసరత్తు చేశారు. జిల్లాల ఎస్పీల పనితీరు, ఇంటలిజెన్స్ నివేదికలు అన్నీ పరిశీలించి పోస్టింగులు ఇవ్వనున్నారు. చంద్రబాబు పరిపాలనలో కలెక్టర్లు, ఎస్పీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు సమర్థులైతే.. పాలన కూడా సమర్థంగా సాగుతుందని నమ్ముతారు. ఇటీవల కలెక్టర్లను .. కీలక శాఖల ఉన్నతాధికారులను మార్చారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో మార్పులపై దృష్టి పెట్టారు.
బదిలీలపై కొంత కాలంగా ఏపీ అధికారవర్గాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులు చంద్రబాబును కూడా కలిశారు. డీజీపీ.. ఇంటలిజెన్స్ ఇన్ పుట్స్ సాయంతో ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సహజంగానే గతంలో పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల.. రాజకీయంగా పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో కొంత మంది పనితీరు ఇబ్బందికరంగా ఉందని భావిస్తున్నారు.
వైపీఎస్ అధికారుల్లో కొంత మంది పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొంత మంది సస్పెన్షన్లు పొడిగించారు. చాలా మందికి పోస్టింగులు ఇచ్చే అవకాశాలు లేవు. వారంతా పై స్తాయిలో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు . కానీ ఒత్తిళ్లకు లొంగే పరిస్థితి లేదని.. సమర్థతను చూపి.. వైసీపీ నేతలు క్రమంగా పెంచుతున్న రౌడీ రాజకీయాల్ని అణిచి వేసే వారికే ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు.


