తమిళనాడు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్.. పూర్తి స్థాయిలో పర్యటనలు ప్రారంభించారు. ‘మీట్ ది పీపుల్’ పేరుతో రోడ్ షోలు ప్రారంభించారు. తిరుచ్చి నుంచి ప్రారంభించారు. విజయ్ కు ఉన్న స్టార్ డమ్ కారణంగా జన సమీకరణ కూడా అవసరం ఉండదు. ఆయన పర్యటిస్తే సహజంగానే జనం వస్తారు. పార్టీ టిక్కెట్ ఆశించే నేతలు మరింత షో చేస్తారు. టూర్లు సక్సెస్ కావడం ఖాయం. అది చాలా హైప్ ఇస్తుంది.
సినిమాలకు ఓపెనింగ్స్ రావడానికి హైప్ చాలా ముఖ్యం. అది ఎలా తెచ్చుకోవాలో విజయ్ కు క్లారిటీ ఉంది. అందుకే ముందస్తుగా మీట్ ది పీపుల్ అని .. ర్యాలీలు ప్రారంభించారు. డిసెంబర్ నుంచి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. తమిళనాడు రాజకీయాల నుంచి జలలలిత, కరుణానిధి కొద్ది తేడాతో వెళ్లిపోవడంతో.. అక్కడ నాయకత్వ శూన్యత ఉంది. స్టాలిన్ తర్వాత ఆ స్థాయి నాయకుడు ఎవరూ కనిపించడంలేదు. ఆ రేసులో తాను కూడా ఉండాలని.. విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
విజయ్ తన చివరి సినిమాను పూర్తి చేశారు. అది కూడా రాజకీయంగా ఉపయోగపడేలా ఉండేలా సిద్ధం చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ అయితే మంచి శుభశకునంలా ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ అంతా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు.. కానీ తమిళనాడు రాజకీయాలకు సరిపోయే సమీకరణాలు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలం కావడంతో..విజయ్ ప్రబావం ఎంత అన్నదానిపై ఇంకా సందేహాలు ఉన్నాయి. కానీ తాను జయలలిత, ఎంజీఆర్ లా సంచలనాలు సృష్టిస్తానని విజయ్ నమ్మకంతో ఉన్నారు.