పండగ వస్తే ఏదైనా సంబరాలు జరిగితే ఉండే ఉత్సాహం వేరు. దసరా ఉత్సవాలకు విజయవాడను ఫేమస్ చేసేందుకు ఎంపీ శివనాథ్ నేతృత్వంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో వేడుకల్ని నిర్వహించాలనుకున్నారు. చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ ఉత్సవాలను నిర్వహించవద్దని వైసీపీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చివరికి ఓ ఆలయానికి చెందిన స్థలాన్ని 50 రోజులకు లీజుకు తీసుకుంటే దానిపై కోర్టుకెళ్లారు. కోర్టు వాణిజ్య కార్యకలాపాలకు ఎలా ఇస్తారని చెప్పి.. క్యాన్సిల్ చేయాలని ఆదేశించింది.
అక్కడ కాకపోతే ఇంకో చోట ఉత్సవ్ నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవాలపై వైసీపీకి ఎందుకు ఇంత పగ అన్నదే సామాన్యుడికి అర్థం కాని ప్రశ్న. వెల్లంపల్లి ఇప్పటికే ఆ ఉత్సవాలు.. దసరా వేడుకలకు పోటీగా అని ఓ విచిత్రమైన వాదన తీసుకు వచ్చారు. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు..అక్కడ విజయచాముండేశ్వరి ఆలయానికి పోటీగా నిర్వహిస్తారా?. బయట జరిగే ఉత్సవాలకు..గుడి నవరాత్రులకు తేడా తెలియకుండా ఉంటారా ?. ఇలాంటి విచిత్రమైన కుట్రలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
విజయవాడ ఉత్సవ్‌ను భారీగా ప్లాన్ చేశారు. కళలు, పోటీలు..ఇలా సంక్రాంతి సంబరాలను మించి జరిగేలా చూడాలనుకుంటున్నారు. మైసూరు స్థాయిలో గుర్తింపు వచ్చేలా..ప్రతీ ఏటా నిర్వహించేలా.. ప్రతిష్టాత్మకంగా మార్చాలనుకుంటున్నారు. కానీ ఏం చేసినా.. మాకేంటి అనుకునే వైసీపీ నేతలు.. ఇలాంటి వాటికి అడ్డం పడుతున్నారు. తమ హయాంలో కేసినోలు నిర్వహించి..అవే పెద్ద సంబరాలు అనుకున్న బ్యాచ్ ఇదంతా.