ఏపీ లిక్కర్ స్కామ్‌పై బ్యాక్ గ్రౌండ్లో విచారణ చేస్తున్న ఈడీ మనీ లాండరర్లపై ఒక్క సారిగా దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీలాండరింగ్ మధ్యవర్తులకు సంబంధించిన ఆఫీసులు , ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేశారు. గురువారం హైదరాబాద్, ఢిల్లీ NCR, తమిళనాడు , కర్ణాటకతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా దాదాపు రూ.3,500 కోట్లను మళ్లించారు. ఈ తరలింపుల్లో కీలకంగా వ్యవహరించిన మనీ లాండరర్లను , మధ్యవర్తులను ఈ సోదాలు లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ED వాంగ్మూలాలను నమోదు చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కాసిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం , అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించే లాండరింగ్ మార్గాలను ఈడీ గుర్తించింది.
2019 మరియు 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సరఫరా ఆర్డర్లను పొందడానికి 16 మద్యం కంపెనీలు లంచం ఇచ్చాయని సిట్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలు రూ. 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లు ఇచ్చాయి. గత YSRCP ప్రభుత్వ హయాంలో, APSBCL రూ. 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లను జారీ చేసింది. వాటిలో 90 శాతం కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీలలో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్ళాయని SIT తెలిపింది. రూ. 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు , హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ చేసిన వారికి చేరాయి.
APSBCL చెల్లింపులు విడుదల చేసిన తర్వాత, డిస్టిలరీలు ముడి పదార్థాల కొనుగోళ్లు , బ్రాండ్ ప్రమోషన్ల ముసుగులో పెద్ద మొత్తాలను మళ్లించాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నిధులను నగదు రూపంలో ఉపసంహరించుకుని కిక్‌బ్యాక్‌లుగా అప్పగించారని ఇప్పటికే ఆధారాలతో సహా వెల్లడించారు. ఇప్పుడు ఈడీ వీటన్నింటినీ ధృవీకరించుకుని సోదాలు నిర్వహిస్తోంది.