ఎన్నికలకు ముందు యాత్రా 2 పేరుతో సినిమా తీసి జగన్ రెడ్డిని కరుణామయుడిగా చూపించాలనుకున్న మహి వి రాఘవ రెడ్డి చిక్కుల్లో పడుతున్నారు. ఆయన ప్రయత్నం ఆర్గానిక్ గా చేయలేదు. తన డబ్బులతో చేయలేదు. పోనీ వైసీపీ నేతల డబ్బులతో చేసి ఉన్నా..సరే అనుకునేవారు. కానీ అడ్డగోలుగా ప్రజాధనంతో ఆయన సినిమా తీశారు. ఆ విషయం సీఐడీ విచారణలో తేలిందని స్వయంగా అసెంబ్లీలో మంత్రి పార్థసారధి ప్రకటించారు.
త్రీ ఆటమ్స్ లీవ్ర్ అండ్ ఏ స్టోరీ ఎల్ఎల్పీ పేరుతో కంపెనీ పెట్టేసి యాత్రా 2ను నిర్మించారు. సినిమాను సొంత డబ్బులతో తీయాలి.. లేకపోతే పెట్టుబడిదారులతో తీయాలి. కానీ ప్రజాధనంతో తీయడం అవినీతి అవుతుంది. రూ.2 కోట్ల 12 లక్షలు నేరుగా ప్రజాధనం ఈ సంస్థ తీసుకుంది. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఆ డబ్బులు నేరుగా ఆ సినిమాకు పని చేసిన వారికి చేరాయని గుర్తించారు. ఇప్పుడు దానిపై సీఐడీ విచారణకు ఆదేశించారు. నేడో రేపో సీఐడీ రంగంలోకి దిగి.. ఈ ప్రజాధనాన్ని మెక్కేసిన యాత్రా 2 మహి వి రాఘవ్ రెడ్డిగారి స్టోరీ ఏంటో తేల్చే అవకాశం ఉంది.
ఈ సినిమా తీసి రిలీజ్ చేస్తే.. పోస్టర్ల ఖర్చులు కూడా రాలేదు. మొత్తం రీల్స్ లో పోసిన పన్నీరైపోయింది. ఓటీటీలో రిలీఫ్ చేస్తే పట్టుమని వెయ్యిమంది కూడా చూడలేదు. అందుకే నష్టపరిహారం కింద.. జగన్ దగ్గర భూమిని కొట్టేయాలనుకున్నారు మహి వి రాఘవ్. తాను రాయలసీమ వ్యక్తినని.. రాయలసీమలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తానని హార్సిలీ హిల్స్ లో స్థలం కోసం ధరఖాస్తు చేశారు. ఇచ్చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. అప్పట్లో తెలుగు 360 ఇదేంటని ప్రశ్నిస్తే… తెగరెచ్చిపోయారు మహి వి రాఘవ్ రెడ్డిగారు.
ఇప్పుడు అక్రమాలన్నింటి గుట్టు రట్టుచేయడానికి… కథలేంటో తేల్చడానికి సీఐడీ వస్తోంది. వారికి చాలా కథలు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇంకో కొసమెరుపేమిటంటే.. ఈ సినిమాలో జగన్ రెడ్డి కన్నా కన్నా నందిగం సురేశ్ ఇమేజ్ పెంచడానికి మహి వి రాఘవ్ ఎక్కువ ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ సినిమా ఖర్చులో ఆయనే చాలా పెట్టుకున్నారని అంటున్నారు. మరి ఈ సినిమాలో అంతా నొక్కేయడమే తప్ప.. మహి వి రాఘవ్ నిర్మాతగా పెట్టుకున్నదేంటి ?