రాష్ట్రం ఏర్పడినప్పుడు అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఆవేదన చెందారు. తన కొత్తపలుకులో పథకాలు, వాటిని అర్హత లేకపోయినా తీసుకుంటున్న ప్రజలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పథకాల వల్ల అప్పుల ఊబిలోకి ప్రభుత్వాలు వెళ్తున్నాయని ఆ భారం మళ్లీ ప్రజలపై పడుతోందని ఆయన ఆవేదన.
ఆర్కే చెప్పిన విషయం కొత్తది కాదు. ఏ రాజకీయ నాయకుడు తన జేబు నుంచి పైసా ఇవ్వడు. ప్రభుత్వం పేరుతో అప్పులు చేసి.. పథకాల కోసం పంచుతారు. ఎంతో కొంత బాధ్యత ఉన్న రాజకీయ నేతలు అయితే .. వచ్చే ఆదాయం నుంచే పథకాలు అమలు చేసి.. అప్పులతో అభివృద్ధి పనులు చేస్తారు. ఆదాయాలు పెంచుకుంటారు. అప్పులు తీసుకోవాల్సింది కూడా అందుకే. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు నిర్మిస్తే సంపద పెరుగుతుంది. దాని వల్ల ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరిగినట్లే.
కానీ వైఎస్ సీఎం అయినప్పటి నుంచి రాజకీయం మారిపోయింది. విచ్చలవిడిగా పథకాలు అమలు చేసి.. ప్రజలకు డబ్బులు పంచి.. ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. అది రాను రాను వికృతంగా మారిపోయింది. ఆయన కొడుకు జగన్ రెడ్డి వచ్చే సరికి.. ఆస్తులు అమ్మి,అప్పులు చేసి తలా పదివేలు ఇచ్చి మిగతాది తాను దోచుకోవచ్చనుకున్నారు. తెలంగాణలోనూ పథకాల వల్ల లక్షల కోట్ల భారం పడింది. ఇదంతా నడుస్తున్న చరిత్ర. ఆ పథకాలకు మించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్ ఇవ్వాల్సి వస్తున్నాయి. ఈ పథకాలు పొందే వారిలో అర్హత లేని వారే ఎక్కువ అని ఆర్కే.. రేషన్ కార్డుల లెక్కలు చెప్పి నిర్దారించారు. అందులో తప్పేమీ లేదు. నిజంగానే అర్హులకన్నా అనర్హులకే ఎక్కువ అందుతున్నాయి. రాజకీయ పార్టీల టార్గెట్ అర్హులకు ఇవ్వడంకాదు.. ఓటు బ్యాంకును పెంచుకోవడం. అదే చేస్తున్నాయి.
ఆర్కే ఈ కథనంలో పథకాలు ఇచ్చినా ఓడిపోతున్నారని.. ఇవ్వకపోయినా ఓడిపోతారని రాజకీయ పార్టీలకు జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేశారు. కానీ .. పథకాలు ఇవ్వకపోతే అసలుకే ఓడిపోతారు. చాయిస్ ఉండదు. పథకాలు ఇస్తే కనీసం రేసులో ఉంటామని ఆయా పార్టీల వాదన. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ప్రజలే పథకాలు తీసుకోకుండా.. పౌరసమాజం మేల్కొలపాలని ఆర్కే అంటున్నారు. కానీ ఆ పౌరసమాజంలో ప్రజలు కూడా భాగమే. ఇంకెవరు చెబుతారు. కొసమెరుపేమిటంటే వైఎస్ ను పొగడటం. ఆయన రెండో సారి గెలిచేముందు మరిన్ని పథకాలు ప్రకటించాలని పార్టీ నేతలంటే.. అంత కంటే ఇవ్వలేం..గెలిస్తే గెలుస్తాం..లేకపోతే లేదు అన్నారట. అసలు ఈ పథకాల ఘోరాలకు ఆయనే ఆద్యుడని ఎక్కువ మంది అనుకుంటారు. ఆర్కేకు భిన్నంగా అనిపించింది.



