వైసీపీ అధినేత జగన్ రెడ్డిని అనర్హతా భయం వెంటాడుతోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారన్న కారణంగా అనర్హతా వేటు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న సమాచారం రావడంతో వెంటనే జగన్ అప్రమత్తమయ్యారు. అనర్హతా వేటు వేయించుకోవడం కంటే.. రాజీనామా చేయడం మంచిదని ఆయన అనుకుంటున్నారు. పార్టీ నేతలతో అదే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అనర్హతా వేటుకు సిద్ధమయిందన్న సమాచారంతో ముందే రాజీనామాలు చేయడానికి 24న ముహుర్తం ఖరారు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
24న ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం
వారానికి రెండు, మూడురోజుల తప్ప.. మిగతా సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అసెంబ్లీ ప్రారంభం రోజు వచ్చి పార్టీ నేతలతో సమావేశం అయి.. అసెంబ్లీకి వెళ్లవద్దని తేల్చి బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ 24వ తేదీన రానున్నారు. ఆ రోజున ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలనుకుంటున్నారు. అత్యవసర సమావేశానికి రావాలని ఎంపీలకు సమాచారం ఇచ్చారు. వారంతా తప్పనిసరిగా హాజరు కావాలని నిర్దేశించారు.
అసెంబ్లీకి వెళ్లడమా.. రాజీనామాలు చేయడమా ?
ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీకి వెళ్లడం.. రెండు రాజీనామాలు చేయడం. అసెంబ్లీకి వెళ్లడం అంటే జగన్ రెడ్డి తన ఇజ్జత్ ను తాను తీసుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప దాటబోనని ఆయన మంగమ్మ పథకాలు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి హాజరైతే.. అందరూ విచిత్రంగా చూస్తారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం.. యూటర్నులతో పరువు పోగొట్టుకోవడం కామనేనని నవ్వుతారు. అయితే రాజీనామా చేసేందుకు మాత్రం అవకాశం ఉంది.
ప్రజల వద్ద చెప్పాల్సిన వాదన సిద్ధం ?
ఏపీలో తాము తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేకపోయినా హోదా ఇవ్వడం లేదని.. ప్రజల వద్ద చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. కోర్టుకు వెళ్లినా సమాధానం ఇవ్వడం లేదని అందుకే తాము ప్రజల వద్దకు వస్తున్నామని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంది. అందుకే రాజీనామాలు సమర్పించి.. ప్రజల్లోకి వెళ్లే విధంగా 24వ తేదీన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
