సెలవులో ఉన్న తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వల్ల దీర్ఘకాలిక సెలవు పెట్టానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఇప్పుడు అనూహ్యంగా ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్, హరీష్ రావు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేశారు కానీ అధికారవర్గాల నుంచి పిటిషన్ దాఖలు చేసిన మొదటి ఆఫీసర్ మాత్రం స్మితా సబర్వాలే.
ఒక సారి స్మితా సబర్వాల్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఆ తర్వాత వివరణ ఇచ్చేందుకు తనకు 8b 8c నోటీసులు ఇవ్వలేదని అందుకే పిసిగోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్ లో కోరారు. అంటే సాంకేతిక అంశాలు చూపి .. ఆమె క్వాష్ చేయాలని కోరుతున్నారు. కానీ రిపోర్టులో స్మితా సబర్వాల్ చాలా తప్పిదాలు చేసినట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాలేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసేవారని.. బ్యారేజ్ లను సందర్శించేవారని రిపోర్టులో ఉంది.
జిల్లాలు తిరిగి ఎప్పటికప్పుడు అప్పటి సీఎంకు స్మిత సబర్వాల్ రిపోర్టు ఇచ్చేవారని.. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారని ఫోటోలను కూడా రిపోర్టులో నివేదించినట్లుగా తెలుస్ోతంది. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సబర్వాల్ కీలకపాత్ర పోషించారని..నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. వీటన్నింటినీ స్మితా సబర్వాల్ ఖండించడం లేదు. తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ..రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతున్నారు.
