ఈనాడులో వచ్చేవన్నీ అవాస్తవాలని సాక్షిలో వచ్చేవి మాత్రమే నిజాలని వైసీపీ నేతలు అంటూ ఉంటారు. అయితే నిజంగా అవాస్తవాలు వచ్చినప్పుడు లీగల్ నోటీసులు ఇస్తున్నారు. నిజాలు వచ్చినప్పుడు .. రచ్చకెక్కి అబద్దాలు అని గోల చేస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. జగన్ రెడ్డి బినామీ సోదరుడు అనిల్ రెడ్డి కంపెనీల్లో ఓ కంపెనీలో వైఎస్ భారతి డైరక్టర్ గా ఉన్నారని ఈనాడు కథనంలో పేర్కొంది. ఇది అబద్దమని వెంటనే లీగల్ నోటీసులు ఇచ్చారు. నిజమే.. వైఎస్ భారతి రెడ్డి.. వేరని.. ఆమె అనిల్ రెడ్డి తల్లి అని ఈనాడు గుర్తించింది. అందుకే వివరణ కూడా ఇచ్చింది. అది ఆ పత్రిక గొప్పతనం. అదే సమయంలో ఆ పత్రిక గొప్పతనం గురించి సాక్షి , వైసీపీ, భారతి కూడా అందరికీ తెలిసేలా చేశారు.
ఆ ఒక్క దానికే అభ్యంతరం- మిగతా అంతా నిజమే
ఈనాడులో పేర్కొన్న వైఎస్ భారతిరెడ్డి , జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కాదని మాత్రం వైసీపీ క్లారిటీ ఇచ్చింది. దానిపైనే అభ్యంతరం చెప్పింది. మరి మిగతా ఈనాడు చెప్పిందంతా కరెక్టే కదా. తప్పు అని ఖరాఖండిగా అనుకున్న వార్తల్ని ఖండించడానికి వైసీపీ వెంటనే రెడీ అవుతుంది. లీగల్ నోటీసుల్ని పంపుతుంది. కానీ అవి నిజాలు అయితే మాత్రం.. తోక తొక్కినట్లుగా ఎగిరెగిరి పడుతుంది. అదే ఆ పార్టీ వ్యూహం. లిక్కర్ స్కామ్‌పై ఈనాడులో వచ్చిన కథనాలన్నింటిపై ఎలాంటి లీగల్ నోటీసులు జారీ చేయలేదు.. అంటే.. అవన్నీ నిజాలేనని అంగీకరించినట్లవుతుంది.
సాక్షికి ఇచ్చే లీగల్ నోటీసులపై ఎప్పుడైనా స్పందించారా ?
సాక్షి పత్రికలో వచ్చే మాస్ట్ హెడ్ కూడా ఫేకే. ఆ పేరు కింద క్యాప్షన్ కూడా ఫేక్. చేసే పనులకు.. చెప్పుకునే మాటలకు పొంతనే ఉండదు. కళ్ల ముందు జరిగిన విషయాన్ని కూడా పక్కాగా మార్చి రాసి అదే నిజమని చెప్పి నమ్మిస్తారు. ఫేక్ వార్తలతో దాడి చేస్తారు. కొన్ని వందల లీగల్ నోటీసులు సాక్షికి వస్తూ ఉంటాయి. కనీసం ఒక్క దానికి అయినా వివరణ ఇచ్చారా ?. చినబాబు చిరుతిండి పేరుతో రాసిన తప్పుడు కథనంపై లోకేష్ కోర్టుకెళ్లారు. తప్పు చేశామని అంగీకరించకుండా .. క్షమాపణ చెప్పాలని ఎప్పుడైనా అనుకున్నారు. అసలు తప్పుడు కథనాలు రాని రోజే ఉండదు. విలువలు.. విశ్వసనీయత అసలే ఉండవు.
లీగల్ నోటీసు ద్వారా ఈనాడుకు సర్టిఫికెట్
వైఎస్ అనిల్ రెడ్డి తల్లి భారతి రెడ్డి అని పేరు తెలియక.. ఈనాడు కంగారు పడి ఉంటుంది. కానీ తప్పు తెలిసిన తర్వాత దిద్దుకుంది. ఇలా చేయడం ద్వారా తన పత్రికలో వస్తున్న ఇతర వార్తలన్నీ పచ్చి నిజాలని అందరికీ స్పష్టత ఇచ్చింది. ఇలా చేయడానికి వైసీపీ సహకరించింది. పరోక్షంగా అయినా ఇదే నిజం. వైసీపీ , జగన్, భారతిరెడ్డి ఈనాడు ఇమేజ్ ను మరింత పెంచడానికి సాయపడ్డారు.


