ఫిరాయింపులపై ఆధారాలు చూపించాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కల్పించారు. ప్రత్యక్ష విచారణకు తేదీలు ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. ఈ విచారణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెప్పడం ఖాయమే. ఎందుకంటే వారు ఈ మేరకు అదే వాదనను వినిపిస్తూ తమ వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేయాల్సింది వారు పార్టీ మారారు అని చట్టబద్ధంగా నిరూపించడం.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. వారు స్వచ్చందంగా తమ సభ్యత్వాలను వదులుకుని అయినా ఉండాలి లేకపోతే విప్ ధిక్కరించి అయినా ఉండాలి. తాము సభ్యత్వాలను వదులుకోలేదని.. తాము కప్పించుకున్నది కాంగ్రెస్ కండువాలు కాదని.. అంటున్నారు. కాబట్టి ఇక విప్ ధిక్కరించినట్లుగా బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలా విప్ జారీ చేసి వారు ధిక్కరించిన సందర్భం రాలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ముందు ఎలాంటి వాదన వినిపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మీడియా కవరేజీ, ఫోటోలను చూపిస్తే స్పీకర్ అంగీకరించరు. చట్ట ప్రకారం ఆధారాలు చూపించాలి. రెండు రోజులు క్రాస్ ఎగ్జామిన్ పూర్తి చేసిన తరవాత స్పీకర్ .. సుప్రీంకోర్టు నిర్ణయించిన అక్టోబర్ నెలాఖరులోపు నిర్ణయం ప్రకటించనున్నారు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ నిర్ణయాలను తోసిపుచ్చడమే అవుతుందని సహజంగానే ఎవరికైనా అర్థం అవుతుంది. స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ మళ్లీ న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.