తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఘటన సమూల మార్పులు తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనలో తన తప్పిదం లేదని చెప్పుకునేందుకు విజయ్ రొటీన్ రాజకీయాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తోందంటున్నారు. ఇదంతా రాజకీయం. కానీ విచారణలో తేలే విషయాలు కీలకం. డీఎంకే ప్రభుత్వం కాబట్టి నింద తనపైనే వేస్తారని విజయం నిర్ణయానికి వచ్చారు. అందుకే స్వతంత్ర దర్యాప్తు లేదా సీబీఐ అని పిటిషన్ వేశారు. ఈ రాజకీయంలో బీజేపీ రాజకీయం ప్రారంభించింది.
విజయ్‌కు మద్దతుగా అన్నామలై!!
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు.. అన్నామలై విజయ్ కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పిదమేమీ లేదని అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపిణలు చేస్తున్నారు. డీఎంకే ప్రభుత్వం నిజాలు బయటకు రావాలని కేసును సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్ కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెలుస్తుందా అన్న సంగతి పక్కన పెడితే.. విజయ్ పై బీజేపీ ట్రాప్ వేసిందని స్పష్టమవుతోంది. విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది.
విజయను కూటమిలోకి లాగడమే బీజేపీ ఎజెండా
విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని పొత్తులు పెట్టుకునే చాన్సే లేదని చెబుతున్నారు. ఇక డీఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోలేరు. అందుకే ఒంటరిగా మిగిలారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తోంది. అన్నాడీఎంకే, బీజేపీతో కలిసిపోవాలని .. ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటోంది.అలా అయితే తమిళనాడులో డీఎంకేకు చెక్ పెట్టవచ్చని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలకు సరైన దారి.. ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీకి స్పష్టత ఉంది. అందుకే సరైన ట్రాప్ వేసిందని అనుకోవచ్చు.
విజయ్‌కు అసలైన పరీక్ష
ఇప్పుడు విజయ్ కు అసలైన పరీక్ష ఉంది. రాజకీయంగా ఆయన సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఇంకా తెలుసుకోలేదని..కరూర్ నుంచి ఆయన వెళ్లిపోయిన వైనమే అందరికీ స్పష్టతనిచ్చింది. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఆయన అధిగమించాల్సి ఉంది. ఓ వైపు డీఎంకే.. మరో వైపు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. ఎటువైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరం అవుతుంది. ఈ రాజకీయాన్ని ఆయన ఎదుర్కొంటే.. ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ధైర్యం వస్తుంది.
