అమరావతిలో ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయం ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడో కాదు.. ఇప్పుడే ఉన్న పళంగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఆయన రంగంలోకి దించుతున్నారు. పన్నెండు బ్యాంకులు ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణాన్ని ఒకే సారి ప్రారంభించబోతున్నాయి. ఆర్థిక నగరంలో వీటికి కేటాయించిన స్థలాలను చదును చేసి ఇచ్చేశారు. ఇప్పుడు బ్యాంకులు నిర్మాణాలు ప్రారంభించబోతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే రోజు అన్ని కార్యాలయాలకు శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించేలా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. కేవలం ప్రభుత్వం చేపట్టిన పనుకలకే ప్రస్తుతం పదమూడు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు . ఇతర ప్రైవేటు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు చేపట్టిన నిర్మాణాల కోసం రోజుకు కొన్ని వందల మంది అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతిలో పనులు జరుగుతూ కనిపిస్తున్నాయి.
2019కి ముందు అమరావతి పనులు ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ శరవేగంగా సాగేవి. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్రం సహకరిస్తూండటం.. ప్రైవేటు సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు భవిష్యత్ లో మంచి రాబడులు ఇస్తాయని ముందుకు వస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే అమరావతిలో అద్భుతమైన మార్పు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 70 శాతం జరిగి నిలిచిపోయిన పనులను వచ్చే మార్చికి పూర్తి చేసి..అందుబాటులోకి తీసుకు వస్తారు.