‘కాంతార’ చాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టితో తనకున్న అనుబంధం దృష్ట్యా.. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి ఎన్టీఆర్ బయటకు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటీవల ఆయన షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. పక్కటెముకుల దగ్గర నొప్పి అలానే ఉంది. కాసేపు కూడా నిలబడలేకపోతున్నారు. అయినా సరే తన స్నేహితుడి కోసం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణంగా ఎన్టీఆర్ స్పీచులు హుషారుగా ఉంటాయి. ఆయన అరచి అరచి మాట్లాడుతుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా నెమ్మదిగా మాట్లాడారు. ‘గట్టిగా మాట్లాడలేకపోతున్నా.. నొప్పి వల్ల.. ఈసారికి అర్థం చేసుకోండి’ అంటూ ఆయన అభిమానుల్ని వేడుకున్నారు కూడా. ఈ గాయం వల్లే.. ఆయన ‘డ్రాగన్’ షూటింగ్ ని కూడా పక్కన పెట్టారు. వైద్యులు మరో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని తేల్చారు. ఈలోగా ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ కి సంబంధించిన కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు ‘దేవర’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ‘దేవర 2’ ఎప్పుడంటూ అభిమానుల సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. కొరటాల శివ కానీ, ఆయన టీమ్ కానీ ‘దేవర 2’కి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. కల్యాణ్ రామ్ సైతం నోరు విప్పడం లేదు. కొరటాల వేరే సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారని, ఆ సినిమా పూర్తయిన తరవాతే ‘దేవర 2’ గురించి ఆలోచిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఈ యేడాది చివర్లో ‘దేవర 2’ని లాంఛనంగా మొదలెడతారని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ విషయంపై పెదవి విప్పితే కానీ స్పష్టత రాదు.