హనుమాన్ విజయం ప్రశాంత్ వర్మకి గొప్ప బలాన్ని ఇచ్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఫ్రాంచైజ్ చేసుకోవడానికి నమ్మకాన్ని కలిగించింది. ఈ యూనివర్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ని సెట్ చేశాడు వర్మ. అందులో ముందుగా వస్తున్న సినిమా ‘మహాకాళి’. ఫీమేల్ సూపర్ హీరో జానర్లో వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ షో రన్నర్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం.
ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ”మా యూనివర్స్‌కు కొత్త శక్తి తోడైంది. చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపిస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ సక్సెస్ సీక్రెట్… మైథాలజీని సోషల్ డ్రామాలో మిళితం చేయడంతో విజువల్ కి పాన్ ఇండియా కలర్ వచ్చింది. పురాణాలతో పరిచయం ఉన్న అందరికీ ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మహాకాళితో శుక్రాచార్యుడిని దించారు. శుక్రాచార్యుడు అసురుల గురువు, భృగువు మహర్షి కుమారుడు. మృతసంజీవని మంత్రం తెలిసినవాడు. శివుని భక్తుడు. మహాభారతంలో శుక్రాచార్యుడి ప్రభావం ఉంది. అసురులకు ఆయన ఇచ్చిన విద్య, శక్తులు తరువాతి తరాలకు కూడా సహాయపడ్డాయి. అలాంటి పాత్రని మహాకాళిలో డిజైన్ చేసి పాన్ ఇండియా లుక్ తీసుకొచ్చారు.