తెలంగాణ ఉద్యమం నుంచి .. ఇటీవల బీఆర్ఎస్ ఓటమి పాలయ్యే వరకూ తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంటే కవిత ఆధ్వర్యంలో జరిగేవే. అధికారికంగా ప్రభుత్వం నిధులు కూడా కేటాయించేది. అయితే ఆమెకు ఎప్పుడూ గిన్నిస్ రికార్డులు సృష్టించవచ్చు అన్న ఆలోచన రాలేదు. కానీ ప్రభుత్వం ఈ సారి పదివేల మంది మహిళలతో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించింది. గిన్నిస్ వాళ్లను పిలిపించి రికార్డులకు ఎక్కించింది. ఇది కవితకు నచ్చలేదు.
చింతమడక నుంచి లండన్ వరకూ బతుకమ్మ ఉత్సవాల్లో అనేక చోట్ల పాల్గొన్న కవిత చివరికి హైదరాబాద్ కు వచ్చారు. రాగానే జాగృతి తరపున ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పదివేల మందితో బతుకమ్మ నిర్వహించి మహిళల్ని అవమానపరిచారన్నారు. మొదటి నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు ఆరాట పడిన సంస్థ జాగృతి అని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో లక్ష మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ తో ఇది మహిళల పండుగ అని నిరూపిస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తాము ఇంత కంటే పెద్ద బతుకమ్మ పండుగను నిర్వహించామని గుర్తు చేసుకున్నారు.అయితే తాము రికార్డుల కోసం పండుగ నిర్వహించ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కోటి బతుకమ్మలా జాతర చేశామని.. బొడ్డెమ్మ ల నుంచి కోటి బతుకమ్మల వరకు 28 రోజుల పాటు చేశాం. రికార్డుల కోసం కాదన్నారు. తెలంగాణ సాధన కోసం మాత్రమే చేశామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రికార్డుల కోసం చేస్తోందన్నారు. తెలంగాణ తల్లి బొమ్మ పెట్టింది రేవంత్ రెడ్డి అనే పేరు రాకూడదని స్పష్టం చేశారు. మొత్తంగా కవిత గిన్నిస్ రికార్డును వచ్చే ఏడాది తమ పేరు పై తెచ్చుకోవాలని టార్గెట్ నిర్దేశించుకున్నారు.