చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరోల రెమ్యూనరేషన్ల గురించి.. ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు. ఏ పైరసీని నిర్మాతలు సహించలేరు. దొరికితే అందర్నీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు. కానీ ఐబొమ్మ నిర్వాహకులు మాత్రం మా జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తామంటున్నారు.తమ దందా తాము చేసుకోనివ్వాలంటున్నారు.
సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్లో ఉచితంగా ఇచ్చే ఐ బొమ్మ నిర్వాహకుల్ని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు చాలా రోజులుగా రహస్య ఆపరేషన్ చేస్తున్నారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో సాగిన ఈ ఆపరేషన్ మధ్యలో ఉండగానే బదిలీ అయ్యారు. అయితే మరో ముఠాను పట్టుకున్నారు. ఐ బొమ్మ సూత్రధారుల్ని కూడా గుర్తిస్తున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో ఐబొమ్మ ఏకంగా పోలీసుల్నే హెచ్చరిస్తూ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది.
మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది వాటిని బయటపెడతామని హెచ్చరించారు. ఒక హీరో కూడా మా ఫ్యాన్స్‌లో ఉన్నాడు… బయటపెడతామని హెచ్చరించారు. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు..మమ్మల్ని ఆపలేరు… మమ్మల్ని వెతకలేరు అని సవాల్ చేశారు. మాది గ్లోబల్ నెట్ వర్క్ అని..చెప్పుకొచ్చారు. ఇందులో హీరోల రెమ్యూనరేషన్లపై ఎక్కువగా మాట్లాడారు. థియేటర్లలో ప్రింట్స్ తీసిన వారి మీద కాకుండా మీ OTT రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని.. బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాల్లో షూటింగ్, ట్రిప్స్‌కు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ఫస్ట్ కెమెరాల సాయంతో థియేటర్లలో మూవీస్ రికార్డు చేసి ఫ్రింట్స్ రిలీజ్ చేసే వెబ్ సైట్ల మీద దృష్టి పెట్టండి. iBOMMA అనేది సిగరెట్ నుంచి E- సిగరెట్‌కు యూజర్స్‌ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుంది. మేం స్వతహాగా వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నాం. వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీకు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం. బురదలో రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామని పోస్టు పెట్టారు. అంటే ఈ నెట్ వర్క్ లో తెలుగువారు కూడా కీలకమేననని అర్థం చేసుకోవచ్చు.