రాజకీయం రాజకీయమే…కుటుంబం కుటుంబమే అన్నట్లుగా ఉన్న రాజకీయ కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే రాజకీయంగా విబేధించారని చెప్పి కుటుంబానికీ దూరం పెట్టే రాజకీయ కుటుంబాలు కూడా ఉంటున్నాయి. కేసీఆర్ కుటుంబం కార్యక్రమాల్లో ఇప్పుడు కవిత కనిపించడం లేదు. కుటుంబ పరంగా జరిగే పూజలు, ఇతర కార్యక్రమాలకూ పిలవడం లేదు. ఇటీవల హోమం నిర్వహించినా కవిత కనిపించలేదు. తాజాగా దసరా వేడుకలకూ ఆమెను ఆహ్వానించలేదు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన దసరా వేడుకలు, పూజల్లో కేసీఆర్ దంపతులు , బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు , కుటుంబ సభ్యులు , సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్ , కేటీఆర్ దుర్గా మాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు. అందరూ కనిపించారు కానీ కవితను మాత్రం ఆహ్వానించలేదు.
కవిత తనంతట తానుగా పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ ఆమె పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్ లపై ఏమీ వ్యాఖ్యలు చేయలేదు. హరీష్ రావు, సంతోష్ రావుపై మాత్రం రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కవితపై ఆగ్రహంగా ఉన్నారు. ఇంట్లో కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు.