జనసేన పార్టీలో కీలక మార్పు చేశారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరిని నియమించారు. ఆయన పార్టీ అంతర్గత అంశాలను చూసుకుంటారని ప్రకటించారు. ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు చూస్తున్న వ్యవహారాలు మొత్తం ఇక నుంచి రామ్ తాళ్లూరి చూస్తారు. ఇప్పటికే జనసేన పార్టీ ఐటీ విభాగాన్ని రామ్ తాళ్లూరినే చూసుకుంటున్నారు. నాగబాబు బాధ్యతలు కూడా ఆయనకే ఇస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు.
నాగబాబు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం .. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. రామ్ తాళ్లూరి ఖమ్మంజిల్లాకు చెందిన ఎన్నారై. సినిమాలు కూడా నిర్మించారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. రామ్ తాళ్లూరి అమెరికాలో లీడ్ ఐటీ కార్ప్ , ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్, రామ్ ఇన్నోవేషన్స్ (రియల్ ఎస్టేట్) వంటి వ్యాపారాలను నడుపుతున్నారు. సినిమా రంగంలో SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమాలు నిర్మించారు.
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన కలసి పని చేస్తున్నారు. తన నియామకంపై రామ్ తాళ్లూరి సంతోషం వ్యక్తం చేశారు. పవన్ ను మొదటిసారి కలిసిన రోజు నుంచి అదే ఉత్సాహం, ప్రజల కోసం అంకితభావం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణించాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారు. ఈ నియామకం అందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.