స్వేదేశ్ .. ఆత్మనిర్బర్ భారత్ నినాదాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెరపైకి తీసుకు వచ్చారు. వస్తువుల్నే కాదు.. టెక్నాలజీని కూడా స్వదేశీ తయారీదే ఉపయోగిచాలని పిలుపునిచ్చారు. మోదీ ఇలా పిలుపునివ్వడం ఆలస్యం.. కేంద్ర మంత్రులు స్వదేశీ టెక్నాలజీ యాప్స్ ను వినియోగించడం ప్రారంభించారు. మొదట అశ్వని వైష్ణవ్ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు బదులుగా జోహో కార్పొరేషన్ కు చెందిన పీపీటీ,ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. తాజాగా జోహో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా అరట్ఏఐ ను లాంఛ్ చేసింది. దీన్ని బీజేపీ నేతలు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌కు తాము పోటీ ఇవ్వగలమని జోహో కార్పొరేషన్ సీఈవో శ్రీధర్ వెంబు నమ్మకంగా చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగిపోయాక ప్రపంచంమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి కంపెనీకి అయినా టార్గెట్ ప్రపంచం మొత్తం ఉంటుంది. అలాంటప్పుడు మన దేశీ వస్తువుల్నే మనం వాడదాం.. మిగతా వాటిని బహిష్కరిద్దాం.. అనే పిలుపు వర్కవుట్ అవుతుందా..అన్నదే అసలు సందేహం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఉత్పత్తి అయినా ప్రపంచంతో, ప్రపంచ మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది.
ప్రపంచం మొత్తం మార్కెట్ – స్వదేశీ నినాదం తగ్గించుకోవడమే !
వాట్సాప్ ఇప్పుడు బ్యాన్ చేసిన దేశాల్లో మినహా అన్ని చోట్లా ఉంటుంది. ఉచిత సర్వీస్. ఒకప్పుడు విదేశాలకు ఫోన్ చేయాలంటే ఎంతో ఖర్చు అయ్యేది. స్కైప్ లాంటివి వచ్చిన తర్వాత కూడా అది క్లిష్టమైన వ్యవహారంలాగే ఉండేది. కానీ వాట్సాప్ వచ్చిన తర్వాత విదేశాలకు ఫోన్లు కాదు.. వీడియో కాల్స్ చేసుకుని ఉచితంగా మాట్లాడేస్తున్నారు. ఈ విప్లవాన్ని ఎవరూ ఊహించి ఉండరు. వాట్సాప్ దాన్ని సాధించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు ఈ వాట్సాప్ ను అధికారికంగా ఉపయోగించడానికి ఆసక్తి చూపించలేదు. కానీ ఇవాళ.. ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలు వాట్సాప్ మీదనే గవర్నెన్స్‌ను.. ప్రజలకు సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వాట్సాప్‌ను స్వదేశీ నినాదంతో ఢీకొట్టడం అంటే చిన్న విషయం కాదు. శ్రీధర్ వెంబు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ నాయకుడు. మైక్రోసాఫ్ట్‌ను ఢీకొట్టే సత్తా ఉండి ఉండవచ్చు కానీ..దానికి.. బేస్ మాత్రం ఖచ్చితంగా స్వదేశీ నినాదం కాదు. ఆ ఆయనకు స్పష్టత ఉంది. అందుకే తమ మెసెజింగ్ యాప్ .. అరాట్ఏఐకి మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ వరల్డ్ అని చెబుతున్నారు. ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి.. ఈ యాప్ ను తాత్కలికంగా డౌన్ లోడ్ చేయించవచ్చు. కానీ దాన్ని ఉపయోగించేలా చేయడం అన్నదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. పూర్తి స్థాయిలో వాట్సాప్‌కు బానిసలు అయిన వారిని కొత్త యాప్ వైపు తీసుకు రావడం.. భావోద్వేగంతో సాధ్యం కాదు. అద్భుతం జరగాలి. అలా జరగాలని కోరుకుందాం. అయితే ఈ స్వదేశీ నినాదంతో స్వయం సమృద్ధి సాధించవచ్చా.. అనేదే అసలు ప్రశ్న.
ఎగుమతులు.. దిగుమతులు లేని దేశాలే ఉండవు !
ప్రపంచంలో అన్ని దేశాలుకు అన్ని వనరులు ఉండవు. ఒక్కో చోట ఒక్కో సౌలభ్యం ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఎగుమతులు, దిగుమతుల మీదనే తమ అవసరాలు తీర్చుకుంటూ ఉంటాయి. ఏ ఒక్క దేశం కూడా మేము ఎగుమతులు చేయడం.. దిగుమతులు చేసుకోం అని భీష్మించుకుని కూర్చోలేదు. ఒక్క ఉత్తర కొరియా మాత్రమే అలా ఉంటుంది. ఆ దేశం కూడా తమ అధినేత కోసం కార్లను స్మగ్లింగ్ చేసుకుటూ ఉంటుంది. ఆ దేశాన్ని పక్కన పెడితే.. దేశ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, ప్రపంచంతో పోటీ పడేలా తమ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే.. తమకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకోవడం.. తమ దగ్గర ఉన్న వాటిని ఎగుమతి చేసి ఆదాయం సంపాదించుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. తమకు అవసరమైన వాటి కన్నా.. ప్రపంచంలోని ఇతర దేశాలకు అవసరమైన వాటిని తయారు చేసి అందించడం ద్వారా .. దిగుమతుల కన్నా.. ఎగుమతులు ఎక్కువగా చేసుకుంటే.. ఆ దేశం స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేసినట్లే. అలా ఎగుమతులు చేస్తున్నారు అంటే.. తమ దేశ ప్రజల అవసరాలు తీర్చిన తర్వాతే కాబట్టి.. అందులో అభ్యంతర పెట్టాల్సిందేమీ ఉండదు. భారత్ ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించలేదు. భారత్ ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి ఎగుమతి చేస్తున్న మొత్తంతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 778 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అదే సమయంలో 857 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. అంటే 78 బిలియన్ డాలర్ల లోటు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు మరింత పెరిగింది. 94 బిలియన్ డాలర్ల లోటు ఉంది. భారత్ దిగుమతి చేసుకునే వాటిలో వస్తువులు, సేవలు ఉంటాయి. రెండింటిలోనూ లోటు ఉంది. వీటిని అధిగమించాలంటే.. మనం వేటిలో వెనుకబడ్డామో చూసుకుని వాటి ఉత్పత్తిని పెంచేదుకు అదీ కూడా.. దిగుమతి వస్తువుల కంటే మంచి క్వాలిటీతో ..తక్కువ ధరకు వచ్చేలా చేయగలగాలి. అలా చేస్తే స్వదేశీ నినాదం వల్ల మేలు జరుగుతుంది. కానీ ధర ఎక్కువ.. క్వాలిటీ తక్కువ వస్తువుల్ని సరఫరా చేస్తే.. వర్కవుట్ కాదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలా ఒక్క సారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడం అన్నది ఒకే సారి సాధ్యం కాదు. క్రమక్రమంగా మౌలిక సదుపాయాల్ని పెంచుకుంటూ.. ప్రమాణాలు పెంచుకుంటూ పోయినప్పుడే అది సాధ్యమవుతుంది.
తయారీ రంగంలో భారత్ సాధించాల్సింది ఎంతో ఉంది !
భారత్, చైనా 80 ఏళ్ల కిందట ఒకే స్థాయిలో ఉండేవి. చైనాకు జనాభా కాస్త ఎక్కువగా ఉండేవారు. చైనాకు ఉన్న వనరులు, మానవ వనరుల్ని ఉపయోగించుకుని ఆ దేశం ప్రధానంగా తయారీ రంగంపై దృష్టి పెట్టింది. తమ బలం ఏమిటో తెలుసుకుంది. దానికి తగ్గట్లుగా పరుగులు పెట్టింది. ఈ రోజు ప్రపంచం మొత్తం చైనా వస్తువుల్ని ఉపయోగిస్తున్నాయి. చివరికి అమెరికా కూడా చైనా నుంచి రావాల్సినవి రాకపోతే తమపై ప్రభావం పడుతుందని కంగారు పడుతోంది. అధ్యక్షుడు ట్రంప్ కూడా.. చైనా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయని అందుకే ఆ దేశంపై భారత్ పై విరుచుకుపడినట్లుగా పడలేకపోతున్నామని తమ దేశ ప్రజల అవసరాలు చూడటం కూడా తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పదవి చేపట్టిన కొత్తలో పెద్ద ఎత్తున చైనాపై పన్నులేసి.. తర్వాత కాళ్ల బేరానికి వచ్చి ఒప్పందం చేసుకున్నారు ట్రంప్. అలాంటి స్వయం సమృద్ధి బారత్ ఇంకా సాధించలేదు. అందుకే నిర్మోహమాటంగా భారత్ వస్తువులపై పన్నులు బాదుతూ పోతున్నారు ట్రంప్. అదే సమయంలో అమెరికా వస్తువుల్ని ఇండియాలో డంప్ చేయాలనుకుంటున్నారు. దానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ విషయంలో చైనా అంతర్జాతీయ విపణికి అవకాశాలు కల్పిస్తూనే .. తమ దేశ ఉత్పత్తులే తమకు అత్యుత్తమం అన్న భావన తెచ్చుకోగలిగింది. టెస్లా, ఐఫోన్లు సహా ఎన్నో అమెరికన్ కంపెనీలు చైనాలో ఉత్పత్తులు అమ్ముతాయి. అదే సమయంలో వాటికి పోటీగా .. వాటి కన్నా బెటర్ ఉత్పత్తులు చైనా నుంచి వస్తాయి. ఇక్కడ అసలు విషయం అమెరికా కంపెనీలు కూడా చైనాలోనే ఉత్పత్తి చేస్తాయి. తయారీ రంగంపై చైనా సాధించిన పట్టు అలాంటిది. దీపావళి వస్తే.. దేశంలో అత్యధిక ఇళ్లపై వెలిగే లైట్లలో అత్యధిక భాగం చైనా నుంచి వస్తాయి. ఆ విషయం చాలా మందికి తెలియదు. మన దేశంలో అలాంటి వాటి ఉత్పత్తి, మార్కెటింగ్ ఖర్చుతో కూడుకున్నది. అదే చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తే తక్కువకే వస్తాయి. అలాంటప్పుడు స్వదేశీ నినాదం ఎలా సక్సెస్ అవుతుంది..? . అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఇప్పుడు ఫలానా దేశం నుంచి ఫలానా వస్తువుల్ని దిగుమతి చేసకోకుండా ఆపడం చాలా కష్టం. ఇతర దేశాలు మనకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాయో.. వారికి మనం అలాంటి అవకాశాలు కల్పించాలి.
తక్కువ ధర, నాణ్యతతో కూడిన తయారీ రంగ ఎకోసిస్టమ్ ఏర్పడాలి !
అందుకే ఆయా వస్తువులకు ధీటుగా మన ఉత్పత్తి సామర్త్యం మెరుగుపడాలి. భారత్ ఎలక్ట్రానిక్స్ లో దిగుమతులపైనే ఆధారపడుతోంది, ఎలక్ట్రికల్ మెషినరీ & ఎక్విప్మెంట్ లో చైనా, వియట్నాం, సౌత్ కొరియాపై ఆధారపడుతున్నాం. బంగారు, జ్యువెలరీ స్విట్జర్లాండ్, UAE, సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకుంటున్నాం. ఆహార నూనెలు ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి వస్తున్నాయి. వాహనాలు & ఆటో పార్ట్స్ జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్ నుంచివస్తున్నాయి. ఈ ఉత్పత్తులన్నీ ఇండియాలో ఎందుకు చేసుకోలేకపోతున్నాం .. అంటే.. మనం ఇంకా అంత సామర్థ్యం తెచ్చుకోలేకపోయాం అని అర్థం. నిజానికి గత పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకూ మెరుగుపడ్డాం. కానీ అది సరిపోదు. ఇప్పుడు కార్లు, ఫోన్లు ఇండియా నుంచి తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. కానీ ఆ తయారీకి అవసరమైన స్పేర్ పార్ట్స్ ను చాలా వరకూ దిగుమతి చేసుకుంటున్నారు. ఆ స్పేర్ పార్ట్స్ కూడా తయారీ అయ్యేలా ఎకోసిస్టమ్‌ను మార్చగలిగితే అప్పుడు అద్భుతమైన మార్పు వస్తుంది. మహింద్రా కంపెనీ ఇటీవల తయారు చేస్తున్న సూపర్ మోడల్ ఎలక్ట్రిక్ కార్స్.. పార్టులు మొత్తం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నవే . అలాంటివి మేడిన్ ఇండియా అని పేరు పెట్టుకున్నా.. మేడిన్ ఇండియా కాదు. టెక్‌లో అయినా.. వినియోగ వస్తువుల్లో అయినా.. భారత్ స్వయం సమృద్ధి సాధించాలంటే ముందు .. భారత తయారీ రంగ ఎకో సిస్టమ్ మారాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కువగా… భారతీయులు స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలని పిలుపునిస్తారు. స్వదేశీ టెక్ వాడాలని కానీ సమస్య ఇక్కడ ప్రజలు వాడటం కాదు.. . స్వదేశీ ఉత్పత్తులు ప్రజల అవసరాలను తీర్చేలా సమర్థవంతంగా ఉండాలి. తక్కువ ధరకు అందుబాటులోకి రావాలి. అప్పుడు మన మార్కెట్‌నే కాదు.. ప్రపంచ మార్కెట్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. భారత్ కు ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు చేస్తే.. అమెరికా లాంటి దేశాలు.. ట్రంప్ లాంటి అధ్యక్షులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏమీ చేయలేరు. ఎందుకంటే.. వారేమీ మన ఉత్పత్తులను మనపై జాలితో కొనుగోలు చేయడం లేదు.. . వారి అవసరాల కోసమే కొనుగోలు చేస్తున్నారు. అందుకే భారత్ నాయకత్వం ముందుగా ఫోకస్ చేయాల్సింది ప్రజలకు స్వదేశీ ఉత్పత్తులే వాడాలని పిలుపునివ్వడం పై కాదు.. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు వచ్చేలా.. బారత పారిశ్రామిక, టెక్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం.. వారి విజయానికి శక్తి మేర సహకరించడమే. అది పూర్తి స్థాయిలో జరిగిన రోజున.. భారత్ .. స్వయం సమృద్ధి సాధిస్తుంది. ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తులు అందిస్తుంది.