అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పులకేశి ప్రవర్తనలో మరో స్టేజ్‌కు దాటిపోయారు. నోబెల్ శాంతిబహుమతిని ఇస్తారా చస్తారా అన్నట్లుగా కమిటీని ఆయన బెదిరిస్తున్నారు. ఆ కమిటీ అమెరికాకు సంబంధం లేనిది కావడంతో బతికిపోయారు. లేకపోతే ఇప్పటికే ఆయన తనకు తానే బహుమతి ప్రకటించేసుకుని ఉండేవారు. తనకు నోబెల్ ఇవ్వకపోతే అమెరికాకే అవమానం అని బ్లాక్ మెయిలింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కు లొంగేందుకు నోబెల్ కమిటీ సిద్ధమయ్యే అవకాశాలు ఉండవు.
నోబెల్ శాంతి బహుమతి విజేతను పదో తేదీన ప్రకటించనున్నారు. అందు కోసమే తాను ఏడు యుద్ధాలు ఆపానని ప్రకటించుకుంటున్నారు. ప్రపంచశాంతి కోసం ప్రయత్నిస్తున్నానని అంటున్నారు. కానీ ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచం మొత్తం అశాంతిగా మారింది. పులకేశీ నిర్ణయాలతో ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయడం లేదు. గాజాలో మారణహోమానికి ఆయనదే బాధ్యత. సున్నితంగా డీల్ చేయాల్సిన అంశాలను బెదిరించి.. రెచ్చగొట్టి పెద్దవి చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానని చర్చలు జరిపి వివాదాన్ని మరింత పెద్దది చేశారు. ఇప్పుడు ఆ పేరుతో భారత్ లాంటి దేశాలపై తన మందబుద్దిని చూపిస్తున్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాక ముందు అమెరికాతో పాటు ప్రపంచం అంతా ప్రశాంతంగానే ఉండేది. కానీ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత దేశాల మధ్య వివాదాలను ఎగదోయడం ప్రారంభించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిందేమీ లేదు. మంటలు పెట్టి.. తానే ఆర్పానని చెప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. భారత్ పై పాక్ ను ఎగదోసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయుధాలిస్తానంటున్నారు. ఇలాంటి వ్యక్తికి శాంతిబహుమతి ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారా?. ప్రపంచ అశాంతికి కారణమైన వ్యక్తిగా ఎవరైనా అవార్డు ఇస్తే దానికి ట్రంప్ సరైన అభ్యర్థి అవుతారనేది సెటైర్ కాదు.. నిజం అనుకోవచ్చు.