పాక్ ఆక్రమిత కశ్మర్ లో ఇప్పుడు ప్రజా తిరుగుబాటు జరుగుతోంది. ప్రజలంతా పాక్ ప్రభుత్వంపై తిరుగబడుతున్నారు. అన్నీ స్తంభించిపోయాయి. ప్రజల్ని కట్టడి చేయడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపింది. వారు ఆందోళనలపై కాల్పులు జరిపి కొంత మంది చనిపోవడానికి కారణం అయ్యారు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పుడు పీవోకేలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద 30కిపైగా డిమాండ్లు పెట్టారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్చలకు కమిటీని నియమించిది. ఆ డిమాండ్లను తీర్చేంత శక్తి పాక్ ప్రభుత్వం వద్ద లేదు. ఏదో విధంగా టైంపాస్ చేయాలని.. ఘర్షణలు చెలరేగకుండా.. తిరుగుబాటును ఆపేయాలని అనుకుంటోంది. అక్కడ జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ స్పందించింది. వాటికి పాకిస్తాన్ ను బాధ్యత వహించేలా చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఇటీవల ఆప్ఘన్ శివార్లలో సొంత దేశ ప్రజలపై సైన్యంతో మిస్సైళ్ల దాడి చేయించింది పాకిస్తాన్. ముప్ఫై మందికిపైగా చనిపోయారు. వారంతా టెర్రరిస్టులని పాక్ చెప్పుకుంది.
ఓ వైపు బలూచిస్తాన్, మరో ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతాలు, మరో వైపు పీవోకే ఇలా.. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆ దేశం మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచుతోందని .. ఈ సారి కుట్రలు చేస్తే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదంతా వ్యూహాత్మకమేనని అంచనా వేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల .. పాకిస్తాన్ తీరుపై హెచ్చరికలు జారీ చేయడానికి కూడా ప్రత్యేకమైన వ్యూహం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం బీజేపీ ప్రభుత్వానికి దీర్ఘకాల లక్ష్యం. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టేందుకు సిద్ధంగా లేదు. అయితే పీవోకేను స్వాధీనం చేసుకునే క్రమంలో దేశమంతా అలజడి రేగాలని కోరుకోవడం లేదు. సింపుల్ గా పనులు పూర్తి చేయాలని అనుకుంటోంది. ఆ దిశగానే జరుగుతున్న ప్రణాళికల్ని అమలు చేస్తున్నట్లుగా అనుకోవచ్చు.