కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ నోరు మెదిపేవారు కాదు. సందర్భం వస్తే పొగడ్తలు కురిపించడానికి ఇంకా చాన్స్ వస్తే.. వారు చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావడానికి ఉత్సాహపడేవారు. సంతోష్ రావు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎక్కడెక్కడి సెలబ్రిటీలో వచ్చి మొక్కలు నాటి ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవారు. ఇండస్ట్రీపై వారి పట్టు అలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సమస్యలు చెప్పుకోవడం కాదు.. జనరలైజ్ చేసి అంతా నాశనం అయిపోయింది మీరు రావాలని కేసీఆర్, కేటీఆర్‌లను ధైర్యంగా పిలుస్తున్నారు.
నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ పెద్ద పాఠం నేర్పి ఉంటాయి. ఆయన అంత నేరుగా ఎందుకు ప్రభుత్వంపై దాడి చేశారో కారణం చెప్పలేదు. ఆయనకు ఏం కష్టం వచ్చిందని.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది చెప్పలేదు. కానీ మొత్తం నాశనం అయిపోయిందని తేల్చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త ఇలాంటి ట్వీట్లు వేస్తే ప్రభుత్వం పట్టించుకునేది కాదేమో కానీ.. ఇక్కడ ట్వీట్లు వేసింది గుర్తింపు ఉన్న నటుడు. అదీ కూడా తెలంగాణకు చెందిన నటుడు.
ఎలాగోలా ఆ ట్వీట్లను డిలీట్ చేయించారు కానీ.. జరిగిన డ్యామేజ్ ను మాత్రం కంట్రోల్ చేయలేరు. ఇదంతా తాము ఎవర్నీ కట్టడి చేయబోమని … బెదిరించబోమని ఇచ్చిన ఫ్రీడమేనని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదని.. అల్లు అర్జున్ అరెస్టు ద్వారా ఓ సంకేతం పంపించారు. కానీ అది వర్కవుట్ అవలేదని రాహుల్ రామకృష్ణ ఉదంతం ద్వారా బయటపడింది. ఇండస్ట్రీని డీల్ చేయడంలో వ్యూహాత్మక తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అసంతృప్తి మాత్రం.. కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.