భారీ అంచనాలతో విడుదలైన ‘వార్ 2’ లెక్క తప్పింది. హృతిక్ రోషన్ స్టార్ డమ్, ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమాని కాపాడలేకపోయాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం అభిమానుల్ని సైతం మెప్పించలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ పై తొలిసారి హృతిక్ రోషన్ స్పందించారు. వార్ 2 కోసం చాలా కూల్‌గా, సరదాగా పని చేసుకొంటూ వెళ్లానని, అయాన్ ముఖర్జీ తననీ, సినిమానీ బాగా చూసుకొన్నారని, ప్రతీ సన్నివేశం క్షుణ్ణంగా, అర్థమయ్యేలా తెరకెక్కించారని, అయినా ఫలితం రాలేదని హృతిక్ పేర్కొన్నారు. అయినా అభిమానులు ఈ పరాజయాన్ని తేలిగ్గా తీసుకోవాలని అభ్యర్థించారు. ”నా పని నేను 100 శాతం పూర్తి చేశా. ఒక నటుడిగా సెట్స్ లో ఏం చేయాలో అవన్నీ చేశా. ఇంటికొచ్చేటప్పుడు మనసు తేలిగ్గా ఉండేది. ప్రతీ సినిమా కోసం ఒళ్లు ఒంచి, గాయాలయ్యేలా పని చేయాల్సిన పనిలేదు. కూల్ గా కూడా వర్క్ చేయొచ్చు. కబీర్ పాత్ర గురించి నాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. అందుకే పెద్దగా కష్టపడలేదు” అని చెప్పుకొచ్చారు హృతిక్.
ఎన్టీఆర్ ఈ సినిమా రిజల్ట్ గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. ఆయనకు ఆ ఛాన్స్ కూడా రాలేదు. ‘వార్ 2’ పూర్తయిన వెంటనే… ఆయన `డ్రాగన్` పనుల్లో పడిపోయారు. ఆమధ్య ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్‌కి హాజరైనా సరే.. ‘వార్ 2’ గురించి మాట్లాడలేదు. మరోవైపు ఈ సినిమాని ఓటీటీలో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా సరైన ఫలితాన్ని అందుకోకపోయినా ఓటీటీ వ్యూవర్ షిప్ లో రికార్డులు సృష్టిస్తుందని చిత్రబృందం చెబుతోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కుల్ని కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈనెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.