ఏపీలో ఆటోడ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం రూ. పదిహేను వేలు జమ చేసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఆటోడ్రైవర్లకు యాప్ తీసుకు వస్తామని ప్రకటించారు. ఉబర్ తరహాలో ప్రభుత్వ యాప్ తీసుకు రావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తామని.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తామన్నారు.
ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పాలని సూచించారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డబ్బులన్నీ రిపేర్లకే సరిపోయేవి… జరిమానాలు కూడా వేసి వేధించారని గుర్తు చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు స్వేచ్ఛ ఇచ్చిందని.. ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి ఇవాళ వేదిక వరకూ వచ్చాను… వారి కుటుంబం కష్ట సుఖాలను తెలుసుకున్నాననితెలిపారు.
గత పాలకులు అస్సలు పట్టించుకోకపోవటంతో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను తయారు చేశామని తెలిపారు. అన్నా క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్నాం. మధ్యాహ్నం పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. విజయవాడలో 90 శాతం వాహనాలు సీఎన్జీ ఇంధనంతోనే నడుస్తున్నాయి… వచ్చే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గతంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు… జరిమానాలు భారంగా కాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దు… ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. క్రమశిక్షణగా ఉండి, ప్రజలకు సౌకర్యం కల్పించండి. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోలను దశలవారీగా ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని.. హామీ ఇచ్చారు.