శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యిని కల్తీ చేసిన కేసు మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇప్పటి వరకూ విచారణను అడ్డుకున్నారు. ఇప్పుడు ఆటంకాలు తొలగిపోయాయి. సిట్ మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వైవీ సుబ్బారెడ్డి పీఏకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. విచారణ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తే చాలా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మళ్లీ పని ప్రారంభించిన సుప్రీంకోర్టు సిట్
గతంలో దర్యాప్తు అధికారి వైవీ సుబ్బారెడ్డి పీఏకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆ దర్యాప్తు అధికారి సుప్రీంకోర్టు నియమించిన సిట్ లో భాగం కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అధికారి కాదు కాబట్టి ఆయన దర్యాప్తు చేయడానికి లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానిపై సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారే బాధ్యతలు ఇస్తే సమస్య ఏమిటని ప్రశ్నించి ఆ ఉత్తర్వులను కొట్టేసింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది.
ఇప్పటి వరకూ పాత్రధారుల అరెస్ట్
ఇప్పటి వరకూ కల్తీ నెయ్యి కేసులో పాత్రధారులను అరెస్టు చేశారు. కల్తీ జరిగిందన్న విషయంలో మరో మాటకు తావు లేదు. కల్తీ జరగలేదని వాదించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎలా కల్తీ చేశారో కూడా మొత్తం స్పష్టం ఉంది. కానీ సూత్రధారులెవరో బయటకు రావాల్సి ఉంది. కేసు తమ దగ్గరకు వస్తుందని తెలిసే సరికి.. వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేసి.. కేసును ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాళ కాకపోతే రేపు అయినా కేసును తేల్చాల్సి ఉంటుంది. శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వారూ దొరికిపోవాల్సిందే.
టీటీడీ విజిలెన్స్ రిపోర్టు బయటకు వస్తే మరింత సంచలనం
టీటీడీ చైర్మన్లుగా జగన్ రెడ్డి బంధువులే ఐదేళ్ల పాటు పని చేశారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని సుబ్బారెడ్డికి నాలుగేళ్లు, తన కుమారుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి చివరికి ఏడాది భూమన పదవులు అనుభవించారు. వీరు చేయని దోపిడీ లేదు. ప్రతి దాంట్లోనూ దోపిడీ చేశారు. వారికి దేవుడిపై ఎంత నమ్మకం ఉందో ఎవరికీ తెలియదు.కానీ వారు దేవుడంటే ఏ మాత్రం భక్తి లేనట్లుగా అరాచకాలు చేశారు. అవన్నీ టీటీడీ విజిలెన్స్ రిపోర్టు బయటకు వస్తే అందరికీ తెలుస్తాయి. ముందుగా నెయ్యి కేసులో సూత్రాధారుల్ని బయటకు తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టాల్సి ఉంది.