దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని సోషల్ మీడియాలో చెలరేగిన పుకార్లకు ఆయన చెక్ పెట్టారు. తనకు అలాంటి ఆలోచన లేదని.. తన వ్యతిరేకులే అలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దానం నాగేందర్ .. ఖైతరాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన హైకమాండ్ ను కూడా సంప్రదించారని చెప్పుకున్నారు. కానీ ఈ ప్రతిపాదనకు.. కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదు. కానీ హఠాత్తుగా ఆయన రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల కంటే .. దానం నాగేందర్ పరిస్థితి భిన్నం. మిగతా వారంతా తాము పార్టీ మారలేదని చెప్పుకున్నారు. ఆ మేరకు విచారణకు కూడా హాజరయ్యారు. కానీ దానం నాగేందర్ కు అలా చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తరపున సికింద్రా బాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కూడా. గెలిచి ఉంటే రాజీనామా చేసి ఉండేవారు కానీ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.
మిగతా అందరి ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించవచ్చు కానీ.. దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ అలా చేయడం కష్టం. అలాగని దానంపై అనర్హతా వేటు వేయలేరు. అలాంటి పరిస్థితి వస్తే రాజీనామా చేయిస్తారు. అందుకే రాజీనామా పుకార్లు వస్తున్నాయి. జూబ్లిహిల్స్ టిక్కెట్ ఇస్తే ఆయన రాజీనామా చేయడానికి రెడీనే. కానీ హైకమాండ్ మాత్రం ఆ చాయిస్ ఇవ్వడం లేదు.