రాజమౌళి ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆఖరికి రీ రిలీజ్ కూడా ఆయన విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి1, బాహుబలి 2 రెండు భాగాల్ని కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో ఈనెల 31 న రీ రిలీజ్ పేరుతో వదలబోతున్నారు. ఈరోజుల్లో రీ రిలీజ్లు చాలా కామన్ అయిపోతున్నాయి. తమ సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి హీరోలకూ, ఆయా దర్శకులకూ సైతం తెలియడం లేదు. కానీ ఇక్కడ ఉన్నది రాజమౌళి. ఆయన ఈ సినిమా రీ రిలీజ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. స్వయంగా ఆయనే దగ్గరుండి ఎడిట్ చేశారు. ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’లో సైతం లేని కొన్ని సీన్లు కొత్తగా జోడించినట్టు తెలుస్తోంది. వాటి కోసం ప్రభాస్ అభిమానులు థియేటర్లకు ఎగబడే అవకాశం ఉంది.
దాంతో పాటు ప్రమోషన్లు కూడా భారీగా నిర్వహించే ఛాన్స్ వుంది. అందుకు సంబంధించిన పబ్లిసిటీ ప్లాన్ కూడా రాజమౌళి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఓ కొత్త సినిమా రిలీజ్ సమయంలో ఎంత హడావుడి ఉంటుందో అంతే హడావుడి ఈ సినిమాకూ చేయాలని చూస్తున్నారు. ఓ పక్క మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నా సరే, ప్రమోషన్లను వదలకూడదన్నది ఆయన ఉద్దేశ్యం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి, ప్రభాస్ ని పిలిచి హడావుడి చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ‘బాహుబలి 3’ని సైతం ఎనౌన్స్ చేస్తారని సమాచారం. బాహుబలి ఎపిక్లోనే పార్ట్ 3కి సంబంధించిన ఓ ప్రకటన ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. `కట్టప్ప` పాత్ర నేపథ్యంలో ఓ సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటన కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. రీ రిలీజ్‌లలో ఇప్పటి వరకూ ఏ సినిమా సాధించలేని వసూళ్లు ‘బాహుబలి ఎపిక్’ కైవసం చేసుకొనే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లోనూ ఒకేసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. రీ రిలీజ్‌లలో ఇది మరో రికార్డ్.
ఈ ప్రయత్నం సఫలం అయితే.. ‘పుష్ప ఎపిక్’, ‘కేజీఎఫ్ ఎపిక్’, ‘కాంతార ఎపిక్’ అంటూ రెండు భాగాల్నీ ఒకేసారి మళ్లీ రీరీజులు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.