ట్రిపుల్ ఐటీల్లో ఆహారంపై ఏళ్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. ప్రైవేటు కాంట్రాక్టర్లు గుప్పిట పట్టుకుని ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలకు వెళ్లి అయినా కొనసాగడం కాంట్రాక్టర్లకు అలవాటు అయిపోయింది. వారి తీరు ఏ మాత్రం బాగోలేకపోవడంతో స్వయంగా లోకేష్ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు లేరు. ఏం చేసినా కొనసాగలేకపోయారు. ఇప్పుడు అక్షయపాత్రకు ఆహారం సరఫరా బాధ్యతలు ఇచ్చారు.
ఇదొక్కటే కాదు.. విద్యాశాఖ మొత్తాన్ని ప్రభావితం చేసే చిన్న చిన్న సమస్యలు ఏమైనా తన దృష్టికి వస్తే నారాలోకేష్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టి పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలను గుర్తించడానికి, నేరుగా తన దృష్టికే వచ్చేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రోజూ మానిటర్ చేస్తున్నారు. విద్యాశాఖ విషయంలో నారా లోకేష్ చూపిస్తున్న శ్రద్ధ.. ఇప్పటికే అనేక మార్పులకు కారణం అవుతోంది.
గతంలో విద్యాశాఖలో జవాబుదారీతనం కాస్త తక్కువగా ఉండేది. ప్రభుత్వ స్కూళ్ల పనితీరు గురించి అధికారుల స్థాయిలోనే ఎక్కువగా సమావేశాలు జరిగేవి. కానీ లోకేష్ ఇప్పుడు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. విద్యార్థులు ఏ విషయంలో ఎక్కువగా వెనుకబడి ఉంటున్నారు. ఏ విషయంలో చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బాగా చదువు చెప్పే టీచర్లను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఏపీ విద్యాశాఖలో మంచి ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కారణం అవుతోంది.