అక్కినేని నాగార్జున ప్రయాణం విభన్నమైనది.. విలక్షణమైనది. శివ, గీతాంజలి, హలోబ్రదర్, అన్నమయ్య, శ్రీరామదాసు, మన్మథుడు, మాస్… ఇలా సంబంధం లేని జోనర్లలో సినిమాలు తీస్తుంటారు. అందుకే ఇంత సుదీర్ఘమైన కెరీర్ సాధ్యమైంది. నాగచైతన్య కూడా తనకు అలాంటి కెరీర్నే ఉండాలని కోరుకొంటున్నాడు. తను ఎక్కువగా లవ్ స్టోరీలు చేశాడు. మాస్ సినిమాలు ట్రై చేసినా, పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాగని ప్రతీసారీ ప్రేమకథలే చేయలేడు కదా. అందుకే అప్పుడప్పుడూ రూటు మార్చి ప్రయోగాలు చేయాలనుకొంటున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిరుచుల్ని పంచుకొన్నాడు. తండ్రిలా తనకు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. మైథలాజికల్ సినిమాలు చేయాలని ఉందని చెప్పాడు. అన్నమయ్య లాంటి సినిమాలో నాగచైతన్యని ఊహించలేం కానీ, మైథలాజికల్ సినిమాలైతే చేయొచ్చు. ఈమధ్య ఇలాంటి సినిమాలకు గిరాకీ బాగుంటోంది. రామయణం, మహాభారతం లాంటి ఇంతిహాసాలతో సినిమాలు చేయడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి.. చైతూ కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదో మైథలాజికల్ థ్రిల్లర్. చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. బి.వి.ఎన్.ఎస్ ప్రసాద్ నిర్మాత. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దూత 2 తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్త దర్శకులతో టచ్లో ఉంటున్నాడు. త్వరలోనే చైతూ కొత్త సినిమాకు సంబంధించి ఓ ప్రకటన రాబోతోంది.