భారత జ్యూడిషియరీ చరిత్రలోనే బ్లాక్ డేగా ఈ సోమవారం నిలిచిపోతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణ జరుపుతున్న సమయంలో ఓ లాయర్ నేరుగా సీజేఐ గవాయ్‌పై దాడికి ప్రయత్నించారు. చెప్పును ఆయనపై విసిరారు. ఆ లాయర్ చేస్తున్న పని చూసి దిగ్భ్రాంతికి గురైన మిగతా లాయర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సుప్రీంకోర్టులో సంచలనం సృష్టించింది. ఇలాంటి దాజులకు భయపడేది లేదని సీజేఐ గవాయ్ ప్రకటించారు.
చీఫ్ జస్టిస్‌పై ఆ లాయర్ ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నించారన్న దానిపై స్పష్టత లేదు. ఇటీవల సీజేఐ గవాయ్.. హిందూ ధర్మాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. ఓ కేసు విషయంలో దేవుడిని అడగండి అని వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరిగింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. తాను ఏ మతాన్ని కించ పరచలేదని స్పష్టం చేశారు. సనాతనాన్ని కించపరిచారని ఆ లాయర్ దాడి చేసినట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ అంతర్గతంగా ఇంకేమైనా కారణం ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీజేఐ గవాయ్‌పై దాడిచేసిన లాయర్ పేరు రాకేష్ కిషోర్ గా గుర్తించారు. లాయర్‌ను అరెస్ట్ చేసి, కోర్టు గౌరవానికి అవమానం చేసినందుకు కాంటెంప్ట్ కేసు నమోదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలపై అసలు దృష్టి పెట్టవద్దని..యథావిధిగా కోర్టు కార్యకలాపాలు కొనసాగించాలని సీజేఐ ఆదేశించారు. దాంతో సుప్రీంకోర్టులో కార్యకలాపాలు యధావిథిగా సాగాయి.